హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ శైలేష్ కుమార్ అనే వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతూ పరారీలో ఉన్న శైలేష్ ను తెలంగాణ నేర పరిశోధనా విభాగం (సీఐడీ) అరెస్టు చేసింది.
బీహార్‌కు చెందిన శైలేష్ కుమార్(30) 2020లో ఎస్‌సీసీఎల్ నిర్వహించిన పరీక్షల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించి అవకతవకలకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన ఇన్విజిలేటర్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పలోంచ పోలీసులు..ఈ కేసును సీఐడీకి అప్పగించారు. అయితే.. కేసు నమోదు చేసినప్పటి నుంచి నిందితుడు శైలేష్ పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి అతడి జాడ కోసం వెతుకుతున్న సీఐడీ బృందం బీహార్ కు వెళ్లింది. దర్భంగా జిల్లాలో శైలేష్ ను పట్టుకుంది. శనివారం (ఆగస్టు 26న ) రోజు శైలేష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు సీఐడీ అధికారులు.