వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని మల్కాపూర్ శివారులో ఉన్న మహీంద్రా ట్రాక్టర్ షోరూం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాక్టర్ పై డీజిల్ పోసి తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న షోరూం సిబ్బంది ఆ యువకున్ని అడ్డుకొని డీజిల్ డబ్బా లాగేసుకున్నారు. సుల్తాన్ నగర్ కు చెందిన అఫ్రోజ్ అనే యువకుడు రెండు నెలల క్రితం మహీంద్రా షోరూంలో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కొన్న రెండు నెలలకే ట్రాక్టర్ తరచూ రిపేర్ కు వస్తుందని.. షోరూం నిర్వాహకులు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంలేదని.. చేసేదేమీ లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
తొమ్మిదిన్నర లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనుగోలు చేస్తే అప్పుడే ఎలా రిపేర్ కు వస్తుందని షోరూం నిర్వహకులను ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని ఆ యువకుడు వాపోయాడు. షోరూం సిబ్బంది ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ట్రాక్టర్ చెడిపోతే పోలిసు స్టేషన్ కు రావాలి ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ బాధితున్ని ఎదురుప్రశ్నించారు. తమ సమస్య పోలీసులు తీర్చలేరనుకున్న బాధితుడు నా సమస్య నేనే పరిష్కరించుకుంటానని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.