షెటిల్ ఆడుతూ.. గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి


గుండెపోటు మరణాలు.. కార్డియాక్ అరెస్టులు మళ్లీ పెరిగాయి.. కొన్ని రోజులుగా తగ్గినట్లు అనిపించినా.. ఇప్పుడు ఆ సంఖ్య క్రమంలో పెరగటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. జూన్ 2వ తేదీ ఉదయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన షాకింగ్ కు గురి చేసింది. 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ క్లబ్ లో బూస వెంకటరాజ గంగారం అనే వ్యక్తి షెటిల్ ఆడటానికి.. ఇంటి నుంచి వెళ్లాడు. ఎప్పట్లాగే రెగ్యులర్ ఆయన ఉదయం షెటిల్ ఆడతారు. అదే విధంగా శుక్రవారం వెళ్లారు. స్నేహితులతో కలిసి షెటిల్ ఆడుతున్న సమయంలో.. కోర్టులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భయపడిన స్నేహితులు, ఇతర ఆటగాళ్లు వెంటనే ఆయనకు సీపీఆర్ చేశారు. అయినా స్ప్పహలోకి రాకపోవటంతో.. వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పరిశీలించిన డాక్టర్లు.. అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. 

అప్పటి వరకు తమతో కలిసి షెటిల్ ఆట ఆడిన గంగారం.. కళ్ల ముందే చనిపోవటంతో షాక్ అయ్యారు స్నేహితులు. కొన్నేళ్లుగా అందరం కలిసి షెటిల్ ఆడుతున్నామని.. ఇలా జరుగుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పకూలిన వెంటనే సీపీఆర్ చేశామని.. వెంటనే ఆస్పత్రికి తరలించామని.. అయినా స్నేహితుడిని కాపాడుకోలేకపోయాం అంటున్నారు మిత్రులు.. 

గంగారం కుటుంబ సభ్యులు అయితే షాక్ లో ఉన్నారు. షెటిల్ ఆడి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి.. ఇంటికీ నిర్జీవంగా రావటాన్ని జీర్ణించుకోలేకుండా ఉన్నారు.