ఓ వైపు భార్య నిండు గర్భిణి.. మరో వైపు వరదలు.. ఆస్పత్రికి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి.. ఉన్నది ఒకే మార్గం.. అందులోనూ బ్రిడ్జి.. ఆ బ్రిడ్జి పైనుంచి వరద పొటెత్తుతుంది.. ఇలాంటి సమయంలో ఆ భర్త చేసిన సాహసాన్ని చూస్తే ఔరా అని అనుకోలేకుండా ఉండలేం.. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా భార్యతో సహా పుట్టబోయే బిడ్డతోపాటు తాను కూడా ప్రమాదంలో పడతాడు.. ఇవన్నీ ఆలోచించి.. ధైర్యే సాహసం అన్నట్లు.. తన భార్య కోసం ఆ భర్త చేసిన సాహసం ఇప్పుడు అందరితో శెభాష్ అనిపించుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళ రాష్ట్రం.. ఇడుక్కి జిల్లా..నిన్నటి జల ప్రళయానికి మొత్తం కొట్టుకుపోయింది. ఇలాంటి సమయంలో నిండు గర్భిణి అయిన తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లటం కోసం.. తన దగ్గర ఉన్న 800 సీసీ మారుతి ఆల్టో కారులో..అత్యంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిపై ఉన్న బ్రిడ్జిని ఎంతో చాకచక్యంగా.. ధైర్యంగా దాటేశాడు.. అక్కడ ఉన్న వాళ్లంతా ఊపిరిబిగబట్టి మరీ ఆ ఘటన చూశారు.. బ్రిడ్జి దాటిన క్షణం అందరూ హమ్మయ్యా అనుకుని గుండె బరువును దించేసుకున్నారు.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఇదే..
Intense footage: Maruti Alto braves flooded bridge in Kerala's Idukki district amid heavy rains. Driver risks it all, rushing pregnant wife to hospital. Car barely makes it across partially submerged bridge with raging river below. Authorities urge caution as floods worsen.… pic.twitter.com/WH4KBqbqYa
— Kumaon Jagran (@KumaonJagran) July 31, 2024
కేరళలో ఒక్క వయనాడ్ జిల్లాలో మాత్రమే కాదు మొత్తం 8 జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలో కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అంతటి భారీ వర్షాలు కురిసి ఇడుక్కిలో ఒక నది ఉగ్రరూపం దాల్చింది. ఆ నదిపై కట్టిన బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ పరిస్థితుల్లో బ్రిడ్జిపై నుంచి నదిని దాటి అవతల వైపుకు వెళ్లడం చిన్న విషయం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాలి లేదా ప్రాణాలకు తెగించి బతికి బయటపడాలి. ఈ రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్లలో రెండో ఆప్షన్ను ఎంచుకుని ఓ వ్యక్తి ముందుకు కదిలాడు. కదలక తప్పని పరిస్థితి అతనికి ఎదురైంది. అతని భార్యకు పురిటినొప్పులొచ్చాయి. వరదల కారణంగా స్థానికంగా వైద్య సేవలు అందుబాటులో లేవు.
జోరు వాన. ఊరు దాటి టౌన్కు వెళదామంటే బ్రిడ్జిపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. ఆ పరిస్థితుల్లో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఏదైతే అదైందని ధైర్యం చేసి కారు తీశాడు. ఆ బ్రిడ్జి వైపుగా కారు వెళ్లడం చూసి స్థానికులంతా ఆశ్చర్యపోయారు. వరద ఉధృతి చూసి ‘‘వెళ్లొద్దు.. వెళ్లొద్దు’’ అని కేకలేశారు. అయినా సరే భార్య పురిటినొప్పులతో ప్రసవ వేదన పడుతుంటే ఆ భర్త చూస్తూ ఉండలేకపోయాడు. స్పీడ్గా కారును డ్రైవ్ చేసి బ్రిడ్జిని దాటేశాడు. భార్యను ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదీ ముచ్చట. కేరళలో వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. వయనాడు జిల్లాలో కొండచరియలు సృష్టించిన బీభత్సానికి ఇప్పటికే 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 225 మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వందల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఇంత విషాదంలో కూడా నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో బాధితుల్లో ధైర్యం నింపింది. బతుకు మీద ఆశ బలంగా ఉండాలే గానీ చావునైనా సవాల్ చేయొచ్చనేంత గుండె ధైర్యానిచ్చింది.