మహిళ కండ్లలో కారం కొట్టి.. గోల్డ్ చైన్ తెంపుకుని పరార్

  • మహిళ కండ్లలో కారం కొట్టి.. గోల్డ్ చైన్ తెంపుకుని పరార్
  • ఘట్​కేసర్ పీఎస్ పరిధిలో ఘటన

ఘట్​కేసర్, వెలుగు : మహిళ కండ్లల్లో కారం కొట్టిన ఓ వ్యక్తి.. ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పరారైన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ మహేంద్ర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లాకు చెందిన కల్వకుంట్ల మంజుల(52) మంగళవారం తెల్లవారుజామున తన భర్తతో కలిసి కారులో సిటీకి బయలుదేరింది. మంజుల కాప్రాలోని బంధువుల ఇంట్లో జరిగే ఫంక్షన్​కు వెళ్లాల్సి ఉండగా.. భర్త ఆమెను ఘట్​కేసర్​లోని యమ్నంపేట చౌరస్తా దగ్గర డ్రాప్ చేసి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్​పోర్టు వైపు వెళ్లాడు. 

ఉదయం 6.40 గంటలకు మంజుల యనంపేట చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా.. బైక్​పై వచ్చిన ఓ యువకుడు ఆమె కండ్లల్లో కారం కొట్టాడు. ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కున్నాడు. ఈ క్రమంలో గొలుసు ముక్కలుగా తెగిపోయింది. రెండున్నర తులాల బంగారు గొలుసు కిందపడిపోయింది. చేతికి అందిన మిగతా ఒక తులం బంగారు గొలుసు ముక్కను తీసుకుని చైన్ స్నాచర్ పారిపోయాడు. మంజుల గట్టిగా అరవడంతో స్థానికులు నిందితుడిని వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక సీసీ కెమెరాల ఫుటేజ్​ను పరిశీలించారు. మల్కాజిగిరి ఏసీపీ నరేశ్ రెడ్డి బాధితురాలి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టామని.. చైన్​స్నాచర్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.