తన కొడుకు బర్త్ డే పార్టీకి పిలిచి బంధువులపై దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాలోని అత్వెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నవీన్ కుమార్ అనే వ్యక్తి.. తన కుమారుడు మొదటి బర్త్ డే సందర్భంగా ఇంట్లో నిర్వహించిన పార్టీకి బంధువులను పిలిచాడు. అందరూ కలిసి భోజనాలు చేశారు. ఆ తర్వాత మద్యం మత్తులో నవీన్ కుమార్ ఇంట్లో హల్ చల్ చేశాడు. మద్యం తీసుకొచ్చేందుకు కారు ఇవ్వమని బంధువు రాజును అడగడంతో ఆయన నిరాకరించారు. మందు ఎక్కువైందని, ఈ సమయంలో కారు ఇవ్వడం మంచిది కాదంటూ వాదించడంతో బంధువులు, నవీన్ కు మధ్య గొడవ మొదలైంది. దీంతో సహనం కోల్పోయిన నవీన్ కుమార్ బంధువులు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా తాళాలు వేసి, వారిపై దాడి చేశాడు. ఏం చేయాలో తెలియక బంధువులు భయంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు.