నిర్దోషిగా విడుదల కావాల్సిన వ్యక్తి జైల్లోనే మృతి

నిర్దోషిగా విడుదల కావాల్సిన వ్యక్తి జైల్లోనే మృతి
  • ఖైదీల వివరాలు ఇవ్వాలన్న పీపీ ఆఫీస్‌‌

హైదరాబాద్, వెలుగు: నిర్దోషిగా విడుదల కావాల్సిన వ్యక్తి  జైల్లో ఆరేండ్ల క్రితమే చనిపోయాడని తెలియడంతో హైకోర్టు హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ లో కదలిక వచ్చింది.  జైళ్లలోని ఖైదీలు, విచారణ ఖైదీల వివరాలను సమర్పించాలని జైళ్ల శాఖకు కోరుతూ లేఖ రాసింది. ఖైదీల ఆరోగ్య పరిస్థితి, బెయిల్‌‌ పిటిషన్ల పరిస్థితి, ఇతర వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరింది.

తల్లిని హత్య చేసిన కేసులో 2013లో మెదక్‌‌ జిల్లా పెద్దగుండెల్లికి చెందిన పోచయ్యకు ట్రయల్‌‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పోచయ్యను  నిర్దోషిగా విడుదల చేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఇతర కేసులు ఏమీ లేకపోతే, పోచయ్యను జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.అయితే, ఆరేండ్ల క్రితమే జైలులో పోచయ్య మరణించిన విషయం కోర్టు దృష్టికి రాలేదు. కోర్టులపై జనానికి చులకన భావన ఏర్పడే అస్కారం ఉంటుందని భావించిన పీపీ ఆఫీసు జైళ్ల శాఖకు లేఖ రాసింది.