మామిడి పూత మస్త్‌‌ లేట్‌‌..నెల ఆలస్యంగా కనిపిస్తున్న పూత

  •     ఇప్పటివరకు 30 శాతమే.. 
  •     వాతావరణంలో మార్పులే కారణమంటున్న ఆఫీసర్లు
  •     మామిడి దిగుబడిపై రైతుల ఆందోళన

మహబూబాబాద్, వెలుగు : నవంబర్‌‌లోనే కనిపించాల్సిన మామిడి పూత జనవరి 17 దాటినా పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. దీంతో దిగుబడి భారీ స్థాయిలో తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత రాకపోవడానికి వాతావరణంలో మార్పులే కారణమని హార్టికల్చర్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. నష్ట నివారణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల ఖర్చు

ఉమ్మడి వరంగల్‌‌లోని మహబూబాబాద్‌‌ జిల్లాలో 14,560 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా జనగామలో 6,700, వరంగల్‌‌లో 9,600, ములుగులో 750, జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లాలో 1,500 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం మామిడి సీజన్‌‌ కావడంతో రైతులు ఇప్పటికే కొమ్మ కత్తిరించే పనులు చేపట్టడంతో పాటు, ఎరువులు, నీరు, ఇతర యాజమాన్య పద్ధతులు చేపట్టారు.

ఇందుకోసం ఎకరానికి రూ. 26 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి దిగుబడిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ సరైన టైంలో పూత రాకపోవడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఏర్పడింది. దీంతో రైతులతో పాటు, కౌలుకు తీసుకున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడి, కౌలు డబ్బులైనా వస్తాయా.. లేదా అని ఆవేదన చెందుతున్నారు.

వాతావరణంలో మార్పుల వల్లే...

మామిడి పూత సాధారణంగా నవంబర్‌‌ నెలలో ప్రారంభమై డిసెంబర్‌‌ చివరి వరకు విరగపూయాలి. కానీ ప్రస్తుతం జనవరి 17 దాటినా 30 శాతమే పూత కనిపిస్తోంది. వాతావరణంలో మార్పులకు తోడు పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం లేకపోవడం వల్ల మామిడి పూత ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరి వరకు పూత వచ్చే అవకాశం ఉన్నా అప్పటికి ఎండ వేడిమి పెరిగితే పిందె కట్టే దశలో పూత రాలిపోతుంది.

దీని వల్ల పంట నిలిచే పరిస్థితి ఉండదని హార్టికల్చర్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. పూత ఆలస్యమైతే మే చివరి వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ టైంలో ఈదురుగాలులు, ప్రకృతి వైపరీత్యాల మూలంగా మామిడి చేతికి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. నష్టనివారణ కోసం మామిడి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి  

మామిడి పూత పూర్తి స్థాయిలో రావడానికి మల్టీ కే1 లీటర్‌‌ వాటర్‌‌కి 10 గ్రాముల చొప్పున కలపాలి. తామర పురుగు, తేనె మంచు పురుగు నివారణకు బుఫ్రో ఫిజిన్‌‌ 2 ఎంఎల్ లీటర్ నీటికి, లీటర్‌‌కు 3 గ్రాముల బోరాన్‌‌ కలిపి చెట్టు అంతా తడిచే విధంగా స్ప్రే చేయాలి. పదేళ్లు దాటిన చెట్టుకు 8 లీడర్ల ద్రావణం పడేలా చూసుకోవాలి. తేలికపాటి ఇసుక నేలల్లో సాగయ్యే మామిడి తోటలకు నీటిని తరలించినట్లయితే పూత పూర్తిగా విచ్చుకునే అవకాశం ఉంది.   

రాకేశ్‌‌, హార్టికల్చర్‌‌ ఆఫీసర్‌‌, తొర్రూరు