- కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో ఘటన
కరీంనగర్ క్రైం, వెలుగు : ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన ఓ యువకుడు యువతి గొంతు కోశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో గురువారం జరిగింది. కొత్తపల్లికి చెందిన ఆడెపు వీరేశం, రేణుక దంపతుల కూతురు కావ్యశ్రీ ఎమ్మెస్సీ చదువుతోంది.
ఆమె ఇంటి సమీపంలో ఉండే బొద్దుల సాయి కొంతకాలంగా ప్రేమ పేరుతో కావ్యశ్రీని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి అతన్ని హెచ్చరించారు. దీంతో కొన్నాళ్ల పాటు ఆ యువతికి అతను దూరంగా ఉన్నాడు. గురువారం సాయంత్రం కావ్యశ్రీ తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి లోపలికి చొరబడిన నిందితుడు.. తనను ప్రేమించాలని మరోసారి వేధింపులకు గురి చేశాడు.
ఆమె ఒప్పుకోకపోవడంతో వెంటనే అక్కడే ఉన్న కత్తితో కావ్యశ్రీ గొంతు కోశాడు. తప్పించుకుంటున్న క్రమంలో ఆమె చేతులకు కూడా గాయాలయ్యాయి. భయంతో యువతి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే ఇంటికి చేరుకొని ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.