చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. మావోయిస్టు దంపతుల మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. 

మావోయిస్టు దంపతుల మృతి

భారీగా ఆయుధాలు స్వాధీనం 

భద్రాచలం, వెలుగు : చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బెజ్జి పోలీస్​స్టేషన్ పరిధిలోని దంతేసపురం అడవుల్లో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో  మావోయిస్టు దంపతులు చనిపోయారు. వీరిని గొల్లపల్లి ఏరియా కమాండర్​మడకం ఎర్రా, పొడియం భీమేలుగా గుర్తించారు. ఎర్రాపై రూ.8 లక్షలు, పొడియం భీమేపై రూ.3 లక్షల రివార్డు ఉందని ఎస్పీ సునీల్​శర్మ చెప్పారు. ఆయన కథనం ప్రకారం..మావోయిస్టులు తిరుగుతున్నారనే సమాచారంతో సోమవారం డీఆర్​జీ బలగాలు, కోబ్రా, సీఆర్​పీఎఫ్ ​జవాన్లు దంతేసపురం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు గుట్టపై నుంచి బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.

కాల్పులు ఆగిపోయాక ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మడకం ఎర్రా, ఆయన భార్య పొడియం భీమే డెడ్​బాడీలు కనిపించాయి. బలగాలు బయటకు వచ్చే సమయంలో మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉండడంతో  అదనపు బలగాలను దంతేసపురం అడవుల్లోకి పంపించారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, సామగ్రి తీసుకొచ్చారు. ఎన్​కౌంటర్​లో 303 తుపాకీతో పాటు కంట్రీమేడ్ ​పిస్టల్, డిటోనేటర్లు, మందుపాతర తయారు చేయడానికి ఉపయోగించే  వస్తువులు, వైర్లు, బుల్లెట్లు, మందులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ప్రకటించారు. మృతి చెందిన మావోయిస్టులపై వివిధ దాడులు, ఆయుధాలు ఎత్తుకెళ్లిన కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నాయని చెప్పారు.