
హైదరాబాద్ లో గంజాయి సరఫరా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూనే ఉంది. పోలీసులు ఎన్ని నిబంధనలు విధించినా వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి అక్రమంగా తీసుకొస్తూనే ఉన్నారు దుండగులు. గంజాయి సేవించిన యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ భయాందోలనకు గురిచేస్తున్నారు. గురువారం (ఏప్రిల్ 10) చందానగర్ లో గంజాయి గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. గంజాయి మత్తులో రెచ్చిపోయి యువకులపై విచక్షణా రహితంగా దాడికి దిగారు కొందరు.
ఇంద్రనగర్ లో బైకు పై వెళ్తున్న యువకులపై గంజాయి గ్యాంగ్ దాడులకు దిగింది. కర్రలు, రాడ్ లతో గంగారం కు చెందిన యువకులపై దాడికి దిగటంతో యువకులు అడ్డుకున్నారు. దీంతో మరింతగా రెచ్చిపోవడంతో పెద్ద గొడవ జరిగింది. మత్తులో విచక్షణా రహితంగా కొట్టడంతో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి తల పగిలి తీవ్ర రక్త స్రావం అయ్యింది. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకులను చికిత్స హాస్పిటల్ కు తరలించారు స్థానికులు.
గత కొంతకాలంగా చందానగర్ లో గంజాయి గ్యాంగ్ ఆగడాలకు స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికే కాలనిలో పలుమార్లు గొడవలకు దిగారు. గంజాయి మత్తులో స్థానికులపై కామెంట్స్ చేస్తున్నారు. ప్రశ్నిస్తే గొడవలకు దిగుతున్నారు. ఈ రోజు ఏకంగా రాడ్లతో కొట్టడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గంజాయి గ్యాంగ్ ను పోలీసులు అదుపు చేయాలని స్థానికులు కోరుతున్నారు.