- చేతులపై రోహిత్, శ్రీకాంత్, నరేంద్ర అనే పేర్లు పచ్చబొట్టు
- రేప్, మర్డర్ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ బైపాస్ అండర్ బ్రిడ్జి వద్ద దారుణం
మేడ్చల్, వెలుగు: ఓ వివాహితను బండ రాయితో కొట్టి చంపిన దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతురాలిని గుర్తుపట్టకుండా ముఖం, తల కాల్చేశారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జి వద్ద ఈ దారుణం జరిగింది. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మునీరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జి కింద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉన్నట్టు శుక్రవారం మధ్యాహ్నం సమాచారం వచ్చిందన్నారు.
వెళ్లి పరిశీలించగా 25 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న మహిళను చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు గుర్తించామన్నారు. మృతురాలి మెడలో నల్లపూసల తాడు, కాళ్లకు మట్టెలు ఉన్నాయి. కుడి చేతిపై తెలుగులో శ్రీకాంత్, ఇంగ్లీషులో రోహిత్ అని ఉంది. ఎడమ చేతిపై నరేంద్ర అని ఇంగ్లీషులో రాసి ఉంది. బండ రాయితో కొట్టి చంపిన తర్వాత ఆమె తల, ముఖంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతదేహంపై బట్టలు కూడా దాదాపుగా కాలిపోయాయి.
ఆధారాలు దొరకకుండా చేసేందుకే దుండగులు ఇలా చేశారని తెలుస్తున్నది. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించాయని ఏసీపీ తెలిపారు. మహిళను వేరే ప్రాంతంలో చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా లేక మహిళ ఎవరితోనైనా ఇక్కడికి వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. క్లూస్ టీం ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. రేప్, మర్డర్ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని.. రిపోర్ట్స్ వచ్చాక వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. ఇటీవల నమోదైన మహిళల మిస్సింగ్ కేసుల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు.