- చత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ లో కీలకంగా డీఆర్‌జీ జవాన్లు
- డీఆర్ జీలో లొంగిన నక్సల్స్, ఆదివాసీ యువకులే ఎక్కువ
- 2 గంటల ఎదురుకాల్పుల్లో 31 మంది నక్సల్స్ మృతి
- మృతుల్లో18 మంది పురుష, 13 మంది మహిళా మావోయిస్టులు
భద్రాచలం, వెలుగు: చత్తీస్ గఢ్ లోని అబూజ్ మాఢ్ అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ ఘటన వెనక భద్రతా బలగాలు ముందస్తు సమాచారంతో, పక్కా వ్యూహంతో దాడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తున్నది. మావోయిస్టు కీలక నేతలు సమావేశం అవుతున్నారన్న సమాచారం అందడంతో దాదాపు 1000 మంది జవాన్లతో 2 రోజుల ఆపరేషన్ చేపట్టినట్టు సమాచారం. శుక్రవారం అబూజ్ మాఢ్ అడవుల్లో జరిగిన చరిత్రలోనే అతిపెద్ద ఎన్ కౌంటర్ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు.
వీరిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు పలువురు ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇప్పటివరకూ16 మంది మృతదేహాలను గుర్తించినట్టు శనివారం రాత్రి దంతెవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. మృతుల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్‌కమిటీ ఇంచార్జ్ నీతి, డీవీసీఎంలు సురేశ్ సలాం, మీనా మడకం, పీఎల్జీఏ సభ్యులు అర్జున్, సుందర్, బుధ్రాం, సుక్కు, ఫూలో, బసంతి, సోమె, జమిలా, బార్సూర్.. ఏసీఎంలు సోహాన్, ఆమ్దేయి, సోనూ కొర్రం, రాందేర్, సుక్లూ, జమ్లీ ఉన్నట్టు గుర్తించామన్నారు.
వీరిపై రూ.1.30 కోట్ల రివార్డు ఉన్నట్టు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఎల్ఎంజీ 1, ఏకే 47లు 4, ఎస్ఎల్ఆర్లు 6, ఇన్సాస్లు 3, 303 రైఫిల్స్ 2, ఇతర రైఫిల్స్, నాటు తుపాకులు, ఆటోమెటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. మరో 15 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఎన్ కౌంటర్ లో మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోగా, వారిలో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారన్నారు.
లొంగిన మావోయిస్టులతోనే ఆపరేషన్
మావోయిస్టు కంపెనీ నెంబర్ 6, ఈస్ట్ బస్తర్ దళానికి చెందిన 50 మంది మావోయిస్టులు అబూజ్మాఢ్ లోని తుల్తులీ గ్రామ సమీపంలో సమావేశం నిర్వహిస్తున్నారని పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. దీంతో బుధవారం రాత్రి బస్తర్ దండకారణ్యం పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలోని 5 జిల్లాల బలగాల సమన్వయంతో ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించారు.
గురువారం ఐదు జిల్లాల్లోని డీఆర్జీలో బెస్ట్ జవాన్లను ఎంపిక చేశారు. 1000 మంది జవాన్లకు బ్యాకప్ గా మరో 500 మంది ఎస్టీఎఫ్ జవాన్లను సిద్ధం చేశారు. డీఆర్జీలో లొంగిపోయిన మావోయిస్టులు, అబూజ్మాఢ్పై పట్టు ఉన్న ఆదివాసీ యువకులు ఎక్కువగా ఉంటారు. వీరితోనే ఆపరేషన్ నిర్వహిస్తే విజయం తథ్యం అన్న ధీమాతోనే బస్తర్ ఐజీ సుందర్రాజ్, నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్‌కుమార్, దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ ఆపరేషన్ కు నిర్ణయించారు. వీరి ఆదేశాలతో పక్కా వ్యూహం ప్రకారం గురువారం ఆపరేషన్ ప్రారంభమైంది.
వర్షంలో రాత్రంతా 40 కిలోమీటర్లు నడిచి..
మావోయిస్టులకు ఎలాంటి అనుమానం రాకుండా ముందుగా10 కిలోమీటర్ల వరకూ బలగాలు బైకులపై వెళ్లాయి. అక్కడి నుంచి జవాన్లు 3 టీంలుగా విడిపోయారు. భారీ వర్షం ప్రతిబంధకంగా మారినా.. వీరంతా గుట్టలు ఎక్కుతూ, వాగులు దాటుతూ రాత్రంతా సుమారు 40 కిలోమీటర్లు నడిచారు. రాత్రి వేళ వర్షంలో గుట్టపైనే బస చేసి శుక్రవారం ఉదయం వరకు వేచి చూశారు. గవాడీ, తుల్ తులీ, నెందూర్, రెంగవాయ గ్రామాల ఆదివాసీలకు తెలియకుండా జాగ్రత్తపడుతూ మావోయిస్టుల మీటింగ్ ప్రదేశానికి చేరుకున్నారు. మావోయిస్టు టాప్లీడర్లతో సహా దళాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు మెసేజ్ ఇచ్చారు.
ఉన్నతాధికారుల ఆదేశాలతో మావోయిస్టులను మూడు వైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. భీకరంగా కాల్పులు జరిగాయి. పావుగంటలోనే ఏడుగురు మావోయిస్టులు నేలకొరిగారు. 2 గంటల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. నానా యాతన పడుతూ మృతదేహాలను జవాన్లు మోసుకొచ్చారు. ఈ ఆపరేషన్ లో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ జవాన్లు పోరాడిన తీరు అమోఘం అని దంతెవాడ అడిషనల్ ఎస్పీ ఆర్కే బర్మన్ ప్రశంసించారు.