- ఆదిలాబాద్ వ్యాపారి సొత్తు మాయం
- నాందేడ్ సమీపంలో బ్యాగులు ఎత్తుకెళ్లిన దొంగలు
- రూ.36 లక్షలు పోగొట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి
- కూతురి పెండ్లికి వెళ్లొస్తుండగా ఘటన
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: మహారాష్ర్టలోని నాందేడ్సమీపంలో నందిగ్రామ్రైలులో భారీ చోరీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రియల్ఎస్టేట్వ్యాపారి సురేశ్అగర్వాల్కు చెందిన రూ.36 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దోపిడీ అయ్యాయి. బాధితుల కథనం ప్రకారం..పట్టణానికి చెందిన సురేశ్అగర్వాల్కూతురు పెండ్లి ఉండడంతో ఈ నెల 4న సుమారు 20 మంది కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి మహారాష్ర్టలోని నాందేడ్ వెళ్లారు.
పెండ్లి తర్వాత ఈ నెల 5న నాసిక్, త్రయంబకేశ్వర్పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి వెళ్లారు. తర్వాత నందిగ్రామ్రైలులోని ఏసీ క్లాస్‌లో తిరిగి వస్తున్నారు. రూ.30 లక్షల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలతో పాటు రూ.5లక్షల నగదు, రెండు సెల్ఫోన్లను రెండు బ్యాగుల్లో పెట్టి పడుకున్నారు. 6వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దొంగలు రెండు బ్యాగులను ఎత్తుకెళ్లారు.
నాందేడ్ సమీపంలోకి వచ్చేసరికి బ్యాగులు కనిపించలేదు. దీంతో నాందేడ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ర్ట పోలీస్, రైల్వే పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితులు బ్యాగులో పెట్టిన సెల్ఫోన్ల లొకేషన్లను పరిశీలించగా ఒకటి పర్లి బైద్యనాథ్ వద్ద, మరొకటి ఔరంగాబాద్‌లో ఉన్నట్టు చూపించింది. కాగా, ఇదే రైలులో ఈ వారంలో నాలుగు దొంగతనాలు జరిగినట్లు బాధితులు తెలిపారు.