పట్టపగలే దుకాణంలో చోరీ.. బైక్ పై పరార్

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. కిరాణా షాపులో పెట్టిన రూ. 50 వేల బ్యాగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. విషయం తెలుసుకున్న షాపు యజమాని లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... బాన్సువాడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా వీరభద్ర కన్ఫెక్షనరీ పేరిట ప్రవీణ్ కిరాణ షాపును నిర్వహిస్తున్నాడు.

ఎప్పటిలాగానే షాపును తెరవడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. రూ. 50 వేలు ఉన్న బ్యాగును తీసుకొచ్చాడు. పల్సర్ బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ప్రవీణ్ ను ఫాలో అయ్యారు. డబ్బుల బ్యాగ్ ను షాపులో పెట్టి.. షెట్టర్ కిందకు దించి.. కూరగాయలు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు షట్టర్ లేపి షాపులో ఉన్న రూ. 50 వేల బ్యాగ్ ను దొంగిలించాడు. అక్కడనే ఉన్న పండ్ల వ్యాపారి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అక్కడి నుంచి బైక్ పై పరారయ్యాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.