భద్రాచలం, వెలుగు : పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని భద్రాచలం డివిజన్ దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం గిరిజన గ్రామంలో ఆదివారం పోలీసులు, భద్రాచలంలోని సురక్ష మల్టీ స్పెషాల్టీ, సహస్ర ఆసుపత్రుల ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. 500 మంది ఆదివాసీలకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారని, శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన వారిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఐ దోమల రమేశ్, ఎస్ఐలు రవికుమార్, కేశవ్, జడ్పీటీసీ సీతమ్మ పాల్గొన్నారు.
పటాకుల దుకాణాల్లో నిబంధనలు పాటిస్తలే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన పటాకుల షాపుల వద్ద నిబంధనలు కనిపించడం లేదు. నిబంధనలు తప్పకుండా పాటించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించినా అధికారులు, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. రూల్స్ పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించడం లేదు. లైసెన్సులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా అధికారులు తమకేమీ సంబంధం లేదనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. రెవెన్యూ, పోలీస్, ఫైర్ ఆఫీసర్లు షాపులను చూసి పోతున్నారే తప్ప నిబంధనలను పట్టించుకోకపోవడం లేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రకాశం స్టేడియంలో మూడు గేట్లు ఉన్నా ఒకే గేట్ ఓపెన్ చేసి ఉంచడంతో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే ఈ సారి పటాకుల రేట్లు గతం కంటే 40 శాతం పెరిగాయని అంటున్నారు.
భద్రాద్రి టు కాకినాడ
పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న అక్రమార్కులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో పీడీఎస్ బియ్యంఅక్రమ రవాణా జోరుగా సాగుతోంది. డీలర్లే షాపుల వద్ద కొని రైస్ మిల్లులకు తరలిస్తున్నా, కంప్లైట్ రాలేదని ఆఫీసర్లు దాటవేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఓ అధికారి అండదండలతోనే రైస్ మిల్లర్లు ఈ దందా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా అధికారులకు కంప్లైట్ ఇస్తే వెంటనే ఆ సమాచారం మిల్లర్లకు చేరుతుండడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు వెళ్లాయి. స్టేట్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు దాడులు చేసి పాల్వంచలో మూడు రైస్ మిల్లులను మంగళవారం సీజ్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అడ్డూ అదుపూ లేని దందా..
జిల్లా నుంచి రేషన్ బియ్యం మహారాష్ట్రతో పాటు ఏపీలోని కాకినాడ పోర్టుకు దర్జాగా తరలిపోతున్నాయి. జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని స్టీమ్ రైస్‌గా మార్చి నాలుగు రెట్ల ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. 2021లో జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 79 కేసులు నమోదు కావడం గమనార్హం. పాల్వంచలో అత్యధికంగా 12 కేసులు, కొత్తగూడెం వన్‌టౌన్ పరిధిలో 11, అశ్వారావుపేట పరిధిలో 7, మణుగూరు, దమ్మపేట, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదేసి కేసులు నమోదయ్యాయి. 2021లో 1329 క్వింటాళ్లు, ఈ ఏడాది ఇప్పటి వరకు 2697క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 123 కేసులు నమోదు చేసి 2231 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల టేకులపల్లి నుంచి డీసీఎంలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వదిలిపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అదే వెహికల్ కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో పోలీసులు పట్టుకోవడంతో పోలీస్ శాఖలో బియ్యం అక్రమ రవాణా కలకలం రేపింది.
అశ్వారావుపేటలో గత నెలలో కేవలం ఐదు రోజుల వ్యవధిలో 455 క్వింటాళ్ల బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తుండగా వరంగల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు పట్టుకున్నారు. సింగరేణి రైలులో మహారాష్ట్రలోని బల్హార్షా ప్రాంతానికి రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ఇటీవల కొత్తగూడెం రైల్వే స్టేషన్లో సింగరేణి రైలులో 50 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. రేషన్ డీలర్లే తమ పరిధిలోని లబ్ధిదారులకు బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ ఈ అక్రమ దందా సాగిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యం రైస్ మిల్లులకు చేరుతోంది.
రైస్ మిల్లులు సీజ్..
అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో జిల్లా, రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు మూడు రోజులుగా పాల్వంచలోని పలు రైస్ మిల్లులపై దాడులు చేశారు. వాసవీ, ద్వారక కృష్ణ, రామాంజనేయ రైస్ మిల్లుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1400 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మిల్లులపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. ఈ మూడు రైస్‌మిల్లులను సీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ నెల 28 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు
ఖమ్మం, వెలుగు : ఈనెల 28న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి (పీఎస్ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ బాధ్యులు మువ్వా విజయబాబు, బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య, సూతకాని జైపాల్ తెలిపారు. పీఎస్ఆర్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ పేరుతో ఈ నెల 28 నుంచి 31 వరకు ఖమ్మంలో కబడ్డీ, కొత్తగూడెంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి బహుమతి రూ. లక్ష, తర్వాతి స్థానాల్లో నిలిచిన ఏడు జట్లకూ నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్, ప్రోమోలను పీఎస్ఆర్ ట్రస్ట్ బాధ్యులు రిలీజ్ చేశారు. ఈ టోర్నీలను విజయవంతం చేయాలని కోరారు.
ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 28,29,30 తేదీల్లో జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా మ్యాట్ ల మీద డే అండ్ నైట్ కబడ్డీ పోటీలు పురుషులు, మహిళల విభాగాల వారీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాలీబాల్ అసోసియేషన్ గుర్తింపు పొందిన బాలబాలికలకు జూనియర్స్ విభాగంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఈనెల 28,29,30,31 తేదీల్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని ట్రస్ట్ బాధ్యులు తెలిపారు. ఈ సమావేశంలో ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్పొరేటర్ మలీదు జగన్, మైనార్టీ నాయకులు షేక్ ఇమామ్ భాయ్, చింతమళ్ల గురుమూర్తి, మియాభాయ్, ఉమ్మినేని కృష్ణ, కీసర పద్మజారెడ్డి, కొంగర జ్యోతిర్మయి, విజయలక్ష్మి, గుడిపూడి రజనీకాంత్, వట్టికూటి సైదులు గౌడ్, చావా ప్రవీణ్, మెండె వెంకటేశ్ యాదవ్, శేఖర్ యాదవ్ ఉన్నారు.
పోటీలను విజయవంతం చేయాలి
భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెంలో నిర్వహించనున్న రాష్ట్ర ఏడో జూనియర్ వాలీబాల్ పోటీలను విజయవంతం చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు వూకంటి గోపాల్‌రావు, ఆళ్ల మురళి కోరారు. ఆదివారం జడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. నాగేంద్ర త్రివేది, సతీశ్, తూము చౌదరి, రజాక్, కూసన వీరభద్రం పాల్గొన్నారు.
సంక్షోభంలో విద్యారంగం
కామేపల్లి, వెలుగు : ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో విద్యారంగం సంక్షోభంలో కూరుకుపోయిందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి డీఎస్ నాగేశ్వరావు ఆరోపించారు. ఆదివారం కామేపల్లిలో జరిగిన సంఘ మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్కూళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం నరసింహారావు, శ్రీనివాసరావు, సురేశ్, రాములు పాల్గొన్నారు.
ఉద్యమకారులకు అన్యాయం చేసిన్రు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర గౌరవ చైర్మన్ శ్రావణబోయిన నర్సయ్య ఆరోపించారు. కొత్తగూడెంలోని భజనమందిరం ఏరియాలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత వైద్యం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. వలీబాబా, భాస్కర్ రావు, కె. కృష్ణారావు, లింగయ్య, సైమాన్, రామారావు, రాంమూర్తి, అలీముద్దీన్ పాల్గొన్నారు.
రొట్టమాకురేవు అవార్డులకు నలుగురు ఎంపిక
కారేపల్లి,వెలుగు : రొట్టమాకురేవు కవిత్వ అవార్డులకు నలుగురు కవులు ఎంపికయ్యారు. అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు యాకూబ్ తెలిపారు. షేక్ మహ్మద్‌మియా స్మారక అవార్డును ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’కు కవి పసునూరు శ్రీధర్‌బాబు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డుకు ‘ఏడవ రుతువు’కు కవి వైష్ణవశ్రీ, కేఎల్ సర్సింహారావు స్మారక అవార్డుకు ‘ఇప్పుడొక పాట కావాలి’కి కవి బిల్ల మహేందర్, ‘యాలై పూడ్సింది’కి కవి పల్లిపట్టు నాగరాజుకు అవార్డులను అందించనున్నట్లు చెప్పారు.
ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ
ఖమ్మం, వెలుగు : గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ నల్లమోతు తిరుమలరావు అన్నారు. ఆదివారం ఆప్ జిల్లా కార్యాలయంలో జరిగిన వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 నాటికి బీజేపీ పాలనను ఎదిరించే స్థాయిలో ఆప్ విస్తరిస్తుందని, నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, 300 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు, మహిళలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి కల్పన, పంటలకు గిట్టుబాటు ధర లాంటి ఆప్ విధానాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. పట్టణ కన్వీనర్ ఎండీ గఫార్, జాఫర్ మోహియుద్దీన్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు హమీద్, చోటేబాయ్, మీరా, సురేశ్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. ఖమ్మం రిక్కాబజార్ కు చెందిన ఎస్కే ఖాదర్, జి వెంకటేశ్వరరావు ఆప్ లో చేరారు.
రామయ్యకు అభిషేకం.. బంగారు పుష్పార్చన
భద్రాచలం, వెలుగు : శ్రీసీతారామచంద్రస్వామికి గర్భగుడిలో ఆదివారం పంచామృతాలతో అభిషేకం జరిగింది. అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. తర్వాత పాలు, నెయ్యి, పెరుగు, పంచదార, తేనెతో స్వామికి విశేష తిరుమంజనం నిర్వహించారు. భక్తులకు పంచామృతాలను ప్రసాదంగా పంపిణీ చేయగా, మహిళలకు మంజీరాలను అందజేశారు. బాలబోగం నివేదించారు. అనంతరం మూలవరులను అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు.
కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్యకల్యాణం జరిపించారు. 63 జంటలు కంకణాలు ధరించి కల్యాణ క్రతువులో పాల్గొన్నాయి. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత స్వామికి రాజబోగం నివేదన జరిగింది. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. భద్రాచలం దేవస్థానం పూర్వ ఈవో, ప్రస్తుత ఏపీ ఎండోమెంట్ ఎస్టేట్ ల్యాండ్స్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్ కుటుంబసమేతంగా రామయ్యను దర్శించుకున్నారు. స్వామివారికి కల్యాణం నిర్వహించారు.
సీఎస్ఐ చర్చిలో కృతజ్ఞతార్పణల పండుగ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని రామవరం సీఎస్ఐ చర్చిలో కృతజ్ఞతార్పణల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏసుక్రీస్తు అందించిన సేవలను స్మరించుకుంటూ వేడుకలు జరిపారు. పిల్లలు, యువత, మహిళలకు పలు రకాల పోటీలను నిర్వహించారు. సీఎస్ఐ చర్చి ఫాస్ట్రేట్ చైర్మన్ దినకర్ క్రీస్తు సందేశాన్ని అందించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అశోక్ చిట్టిబాబు, పద్మారావు, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
26 నుంచి శివాలయంలో కార్తీక మాసోత్సవాలు
కామేపల్లి, వెలుగు : మండల కేంద్రంలోని బాలత్రిపుర సుందరి, ఇష్టకామేశ్వరి స్వామి(శివాలయం) ఆలయంలో ఈ నెల 26 నుంచి కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గొట్టుపర్తి శివాజీ తెలిపారు. బుధవారం నుంచి శివాలయంలో నిత్యాభిషేకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తామని చెప్పారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో నవంబర్ 3న శివనామ ఏకాహం, 4న హరేరామ నామ ఏకాహం, 5న రామకృష్ణాపురం గ్రామంలో సువర్చన అభయాంజనేయ స్వామి దేవాలయంలో రామనామ ఏకాహం 6న సాయిబాబా మందిరంలో సాయి నామ ఏకాహం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కార్తీక మాసం సందర్భంగా పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి, మణుగూరు, మధిర డిపోల నుంచి బస్సులు నడుపనున్నట్లు ఆర్ఎం ఎస్తర్ ప్రభులత ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలోని అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలలో పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ ఆదివారం రాత్రి నుంచి ఆయా డిపోల నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనార్థం ఈ బస్సులు వేసినట్లు తెలిపారు. 30 మంది ఆపై భక్తులుంటే ఏ రోజుకైనా పంచారామాలతో పాటు అన్నవరానికి ప్రత్యేక బస్సు కేటాయిస్తామని చెప్పారు. శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పంచారామాలకు కొత్తగూడెం నుంచి పెద్దలకు రూ. 1,270, పిల్లలకు రూ. 650, భద్రాచలం నుంచి పెద్దలకు రూ. 1,260, పిల్లలకు రూ. 650, మణుగూరు నుంచి పెద్దలకు రూ. 1,420, పిల్లలకు రూ. 720, ఖమ్మం నుంచి పెద్దలకు రూ. 1200, పిల్లలకు రూ. 610, మధిర నుంచి పెద్దలకు రూ. 1200, పిల్లలకు రూ. 610, సత్తుపల్లి నుంచి పెద్దలకు రూ. 1,040, పిల్లలకు రూ. 530 చార్జీ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నేతలు
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు పలువురు నేతలు, అధికారులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, ఐటీడీఏ పీవోగౌతమ్ పోట్రు తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి
చండ్రుగొండ,వెలుగు : కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని జడ్పీటీసీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం దామరచర్ల గ్రామంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమితుడైన అంతటి రామకృష్ణను సన్మానించారు. రాహూల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర తెలంగాణలో పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన సీఎం కేసీఆర్ కు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. సర్పంచ్ వినోద్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సువేశ్, నర్సింహారావు, దయాకర్ రావు, రామారావు, గోవిందరెడ్డి, రుక్మిణి పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి ఆలయంలో రుద్ర హోమం
పాల్వంచ,వెలుగు : మాస శివరాత్రిని పురస్కరించుకొని మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం రుద్రహోమం నిర్వహించారు. ఆదివారం పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు కొదుమూరు వినోద్, రాజేశ్వరరావు రూ.10 వేలు విరాళంగా అందజేశారు. అమ్మవారిని గజమాలతో అలంకరించారు. ఈ నెల 25న సూర్యగ్రహణం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో తెలిపారు.