- చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో అసమ్మతి వర్గీయుల సమావేశం
దేవరకొండ(చందంపేట),వెలుగు : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు నియోజకవర్గంలో అసమ్మతి పోరు పెరిగింది. వచ్చే ఎన్నికల్లో రవీంద్రకుమార్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని అధిష్టానాన్ని అసమ్మతి వర్గీయులు కోరారు. మంగళవారం చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామంలో టిక్కెట్ ఆశిస్తున్న మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గీయుడు వడ్త్య దేవేందర్‌నాయక్ ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కార్యకర్తలను అవమానాలకు గురి చేస్తున్నారని, దీంతో పార్టీకి దూరమయ్యే పరిస్ధితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రవీంద్రకుమార్‌కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే ఆయన గెలుపు కోసం ఎవరూ కూడా పని చేసే పరిస్ధితులు లేవని స్పష్టం చేశారు.వడ్త్య దేవేందర్నాయక్కు పార్టీ టిక్కెట్ ఇస్తే గెలిపించి అసెంబ్లీకి పంపుతామని నాయకులు తీర్మానం చేశారు. తాము చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి పంపుతామని నాయకులు చెప్పారు. సమావేశంలో దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, లక్ష్మణ్‌నాయక్,మహాలచ్చయ్య,జైపాల్‌రెడ్డి, బిక్కునాయక్,మురుపునూతల సర్పంచ్ వీరారెడ్డి,తెల్దేవర్పల్లి సర్పంచ్ పాపానాయక్, మాజీ సర్పంచ్ రవి, సుక్కునాయక్,తిరుపతయ్య,భరత్, పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.