ఏనుమాముల మార్కెట్‭లో గన్నీ బ్యాగుల వివాదంపై చర్చలు సఫలం

ఉమ్మడి వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గన్నీ బ్యాగుల వివాదంపై చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి యధావిధిగా మిర్చి, పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో కలెక్టర్ గోపి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు సంఘాల నేతలు మార్కెటింగ్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఉన్న విధానంలో రైతులకు ఒక గన్నీ బ్యాగుకు రూ.30 చెల్లించడానికి వ్యాపారులు అంగీకరించారు. 

ఇద్దరు చొప్పున వ్యాపారులు, రైతు సంఘాల నేతలు మార్కెట్ అధికారులతో ఒక కమిటీ వేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మిగతా మార్కెట్లలో కొనుగోళ్లు, ఇతర విషయాలను కమిటీ పరిశీలించనుంది. ఇతర మార్కెట్లలో అమలవుతున్న తీరును బట్టి గన్నీ బ్యాగులకు చెల్లించే రేట్లు ఖరారు చేయాలని రైతుల సంఘాల నేతలు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్‭లో మార్పులు, చేర్పులపై తుది నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దీనిపై ఈనెల 26న మరోసారి మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సమావేశం నిర్వహించనున్నారు. 

రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. వ్యాపారస్తులు రైతులకు సహకరించాలని సూచించారు. నాణ్యతలో రాజీ వద్దన్నారు. రైతాంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయడం లేదని ఎర్రబెల్లి దయాకర్​ రావు చెప్పారు. పూర్తిగా చెడిపోయిన గోనె సంచులు, యూరియా బస్తాలను రిజెక్ట్ చేస్తే.. అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కొంత మార్పులు చేస్తూ.. కలెక్టర్ తాత్కాలిక ఆర్డర్ ఇస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.