పలు ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు: మేయర్ విజయలక్ష్మి

పలు ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు: మేయర్ విజయలక్ష్మి

సికింద్రాబాద్, వెలుగు: బల్దియా హెడ్డాఫీసులో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశంలో 18 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. భరత్​నగర్​ కల్పతరువు రెసిడెన్సీ నుంచి తిరుమల కాన్వెంట్ స్కూల్ మీదుగా ఆర్ వోబీ నుంచి హైటెక్స్ రోడ్, మోతినగర్, బోరబండ, మల్లాపూర్ వరకు 30 ఫీట్ల రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వ అనుమతి సిఫార్సు, 306 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్ రోడ్​నుంచి సిటాడెల్ హోటల్, కన్వెన్షన్ మీదుగా దివ్యశక్తి ప్రైవేట్ లిమిటెడ్ వరకు 12 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం హెచ్ఎండీఏ జోన్ లోని రాజేంద్రనగర్ మండలం గగన్ పహాడ్ గ్రామంలో 15 ఆస్తుల సేకరణకు ప్రభుత్వ సిఫారసును కమిటీ ఆమోదించింది. బల్కంపేట నుంచి అమీర్ పేట లాల్ హౌస్ బంగ్లా, శ్యామ్ కరణ్ వరకు 18 మీటర్ల రోడ్డు విస్తరణ కోసం 136 ఆస్తుల సేకరణ సహా మొత్తం 18 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయి జెన్ శేఖర్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, ఆర్. సునీత, టి.మహేశ్వరి, కమిషనర్ లోకేశ్​ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వానాకాలం సమస్యలపై చర్చించాలి

వానాకాలంలో తమ డివిజన్లలో నెలకొనే సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు రజిత, విజయా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్​కు వారు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం కార్పొరేటర్లు మాట్లాడుతూ.. సిటీలో వాన పడితే జనానికి ఇబ్బందులు తప్పట్లేదని.. ఎక్కడ నాలాలు పొంగుతాయో తెలియక భయాందోళన పరిస్థితి నెలకొందన్నారు. నాలాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నారని.. కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు అందుకు వేరుగా ఉన్నాయని వారు తెలిపారు.  వరద పరిస్థితులపై ప్రత్యేకంగా బల్దియా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని వారు కోరారు.