జూలై 16న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. 9 పాయింట్స్!

జూలై 16న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. 9 పాయింట్స్!
  •   కలెక్టర్లు, ఎస్పీల మీటింగ్ ఎజెండా ఫిక్స్
  •   ప్రజాపాలనకు ఫస్ట్ ప్రియార్టీ.. ధరణిపైనా చర్చ
  •   లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ అరికట్టడంపై డిస్కషన్
  •   విద్య, వైద్యం, వ్యవసాయానికీ ప్రాధాన్యం
  •   లిస్ట్ వన మహోత్సవం, మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై 16న సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తొమ్మిది అంశాలతో కూడిన ఎజెండా ఫిక్సయింది. 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. తొమ్మిది అంశాలే ఎజెండాగా నిర్వహించబోయే ఈ సమావేశంలో క్షేత్ర స్థాయి పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం ఆరా తీయనున్నారు. ఇందులో ప్రజాపాలన దరఖాస్తుల గ్రౌండింగ్, అమలు ప్రస్తుత పరిస్తితిపై చర్చించనున్నారు. 

దీంతో పాటు ధరణిపై ప్రభుత్వం సబ్ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా వస్తున్న అభ్యంతరాలు.. వాటికి పరిష్కార మార్గాలపైనా సమావేశం చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల సమస్యలపైనా డిస్కస్ చేయనున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైనందున పాఠశాలలు, గురుకులాల్లోని అంశాలపై చర్చ జరగనుంది.  సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎపిడమిక్ సెల్ ల పనితీరు... సర్కారు దవాఖానాల్లో వైద్య సేవల తీరు.. మందుల అందుబాటు తదితర అంశాలపై సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. 

వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్న రేవంత్ సర్కారు ఆరోగ్య శ్రీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో ఉన్న రూ. 5లక్షల సాయాన్ని 10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఆరోగ్య శ్రీ సేవలపైనా సీఎం ఆరా తీయనున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ఎస్పీలతో సీఎం చర్చించనున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపైనా ఆరా తీయనున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ కంట్రోల్ పై ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే.. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆరా తీయనున్నారు. 

రాష్ట్రం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు ఏం చేయాలనే అంశాన్ని ఎస్పీలతో చర్చించే అవకాశం ఉంది. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు తమ స్టైల్ ను మార్చి లూఠీ చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. ఏది  ఏమైనా బదిలీలు, పదోన్నతుల తర్వాత.. బడ్జెట్ సమావేశాలకు ముందస్తుగా జరుగుతున్న ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.