మూసీ ప్రక్షాళన మన భవిష్యత్తు కోసమే..ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి : ఎంపీ చామల

మూసీ ప్రక్షాళన మన భవిష్యత్తు కోసమే..ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి : ఎంపీ చామల
  • మూసీ ప్రక్షాళన మన భవిష్యత్తు కోసమే భావితరాల భవిష్యత్తుకోసమే మూసీ బ్యూటిఫికేషన్ అని వెల్లడి​
  • మూసీపై నాగోల్ లో  రైతులు, ప్రజల తో సమావేశం
  • హాజరైన కాంగ్రెస్​ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్​నేతలు

హైదరాబాద్, వెలుగు : మూసీ ప్రక్షాళన బావితరాల భవిష్యత్ కోసమేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి తెలిపారు.  మూసీ నదిలో మంచినీటిని పారించడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని ఫైర్​ అయ్యారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది బ్యూటిఫికేషన్​కు ఈ నది పరీవాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని  కోరారు. మూసీపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

శనివారం హైదరాబాద్ శివారులోని నాగోల్ లో  ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంత రైతులు, ప్రజలతో ఈ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన చామల మాట్లాడుతూ..  గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మూసీ మురికికూపంగా మారిందని ధ్వజమెత్తారు.  మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.  మూసీ పరీవాహక ప్రాంతాలు దోమలకు అడ్డాగా మారాయని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. 

మూసీ నది కాలుష్యంతో జల జీవాలు దాదాపు అంతరించిపోగా,  పశు సంపద కూడా క్రమేపీ కనుమరుగవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో పరవళ్లు తొక్కిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధి భూదాన్ పోచంపల్లి, భువనగిరి, వలిగొండ, రామన్నపేట, నార్కట్​పల్లి, అడ్డగూడూరు,శాలిగౌరారం, జాజిరెడ్డిగూడెం మండలాలు .. నేడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు.  ఒకప్పుడు పచ్చని పంటలు, జలచరాలు, జంతు సంపద,  స్వచ్ఛమైన గాలి, వాతావరణంతో కళకళలాడిన మూసీ పరీవాహక ప్రాంతాలు.. 

నేడు కాలుష్యకారకాలతో విషతుల్యం అవుతున్నాయని అన్నారు.  పండిన పంట సైతం రంగు మారి, తాలురూపంలో బరువు తక్కువగా పండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.  మూసీ నది 5.5 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉన్నదని, ప్రాజెక్టు మునిగిన ఏరియా 6,245 ఎకరాలు అని, కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగయ్యే విస్తీర్ణం 3వేల ఎకరాలని తెలిపారు. 

మూసీ నది పొడవునా బోర్లు, బావులు, చెరువుల ద్వారా దాదాపు 60 వేల ఎకరాల భూమి సాగవుతున్నదని వివరించారు. కాలకూట విషంలా మారి మానవాళి మనుగడకే ప్రమాదంగా పరిణమించిన మూసీ నదిని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు.

మూసీ డెవలప్​మెంట్ ను​ అడ్డుకుంటే పేదల ఉసురు తగుల్తది : బీర్ల అయిలయ్య

మూసీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే పేదల ఉసురు తగిలి పోతారని బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు మూసీ మురికిలో 25 లక్షల మంది జీవిస్తున్నారని, అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపేలా రేవంత్ రెడ్డి పనిచేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.  మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రజల్లో తీవ్ర భయందోళనలు సృష్టిస్తున్నాయని మధుయాష్కీగౌడ్​ మండిపడ్డారు. మూసీపై కేటీఆర్ గోబెల్స్​ప్రచారం చేస్తున్నారని ఎంపీ మల్లు రవి విమర్శించారు. తమ చిన్నతనంలో మూసీలో ఈతకొడుతూ.. 

చేపలు పట్టేదని, కానీ ఇప్పుడు కాలుపెట్టే పరిస్థితి కూడా లేదని ఎమ్మెల్యే కంభం అనిల్​ అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం అప్పుడు రివర్ ఫ్రంట్ అని బోర్డు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం..ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు వ్యతిరేకిస్తున్నదని ఎమ్మెల్యే మందల సామ్యేల్  ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ సురేశ్​షెట్కార్,  ఎమ్మెల్యే లు మల్ రెడ్డి రంగారెడ్డి, బీ లక్ష్మా రెడ్డితో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్లు మల్ రెడ్డి రామిరెడ్డి, బండ్రు శోభారాణి, డీసీసీ ప్రెసిడెంట్ అండం సంజీవరెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.