సికింద్రాబాద్, వెలుగు : రైళ్లలో గంజాయి తరలించే అంతర్ రాష్ర్ట ముఠాలో ఒకరు పట్టుబడ్డారు. నిందితుడి వద్ద రూ.15.50 లక్షల విలువైన 62 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే అర్బన్ డీఎస్పీ ఎన్. జావెద్ సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. ఒడిశాలోని గజపతి జిల్లా లుద్రు గ్రామానికి చెందిన చందకుమార్ నాయక్(34), మిహిర్, చిందాతో పాటు మహారాష్ర్టలోని నాందేడ్‌కు చెందిన మరో ముగ్గురు ఈజీగా మనీ సంపాదించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొని రైళ్లలో సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలించి అమ్ముతున్నారు.
సోమవారం ఉదయం 10.30గంటల సమయంలో రైల్వే పోలీసులు స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా ఒడిశా నుంచి వచ్చిన రైలులోంచి దిగిన ఓ వ్యక్తి వద్ద లగేజీ అనుమానాస్పదంగా కనిపించింది. ఆపి చెక్ చేయగా.. 2 ట్రాలీ, 3 షోల్డర్ బ్యాగుల్లో 62 కిలోల గంజాయి లభించింది. చందకుమార్ నాయక్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ జావెద్ తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చేపట్టినట్టు చెప్పారు.