వాట్సాప్ గ్రూప్ ల వల్ల గొడవలు, కొట్లాటలు జరిగాయన్న వార్తలు చాలా వింటుంటాం. అవి తాత్కాలికంగా జరిగి, తర్వాత సద్దుమణగడం చూస్తుంటాం. కానీ, పుణెలో జరిగిన ఒక వాట్సాప్ వివాదం.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ నాలుక కోసేవరకు వెళ్లింది. వివరాళ్లోకి వెళ్తే..
ఫుణెలోని ఫుర్సుంగి ప్రాంతంలో స్థానిక హౌసింగ్ సొసైటీ వాళ్లందరికి కలిపి ‘ఓం హైట్స్ ఆపరేషన్’అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ అపార్ట్ మెంట్ చైర్ పర్సన్ గ్రూప్ అడ్మిన్ గా ఉన్నాడు. అయితే.. ఆ గ్రూప్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తి తరచూ విద్వేషపూరితమైన, వివాదాస్పదమైన పోస్టులు పెడుతున్నాడని.. అతడిని అడ్మిన్ గ్రూప్ నుంచి తొలగించాడు. ఆ విషయం గురించి అడుగుతూ నిందితుడు అడ్మిన్ కి మెసేజ్ చేయగా, వాటికి అడ్మిన్ స్పందించలేదు. ఆ కోపంతో ఆ వ్యక్తి మరో నలుగురితో కలిసి వెళ్లి అడ్మిన్ ని చితకబాదాడు. ఆ తర్వాత అడ్మిన్ నాలుక కోశాడు. ఈ విషయంపై బాధితుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, నిందితులపై కేసు నమోదైంది. అయితే, బాధితులు, నిందితుల పేర్లు, వివరాలు తెలియాల్సి ఉంది.