మధ్యప్రదేశ్ వినూత్నంగా ఓ వివాహం జరిగింది. అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు మధ్యప్రదేశ్‌లోని రేవాలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఆ నిరసనలలో పాల్గొంటున్న భోపాల్ రైతు నాయకుడు రాంజిత్ సింగ్ కొడుకు పెళ్లి నిశ్చయమైంది. కొడుకు పెళ్లి కోసం ఉద్యమం నుంచి దూరం కాకూడదనుకున్నాడు. అందుకోసం వినూత్నంగా ఆలోచించిన రాంజిత్.. కొడుకు పెళ్లిని తమ నిరసనల మధ్యే చేయాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా.. భోపాల్‌కు 500 కిలోమీటర్ల దూరంలోని రేవాలో జరుగుతున్న నిరసనల వద్ద తన కొడుకు సచిన్, కాబోయే కోడలు అస్మా సింగ్‌ల వివాహం జరిపించాడు.
కేంద్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ మెసెజ్ ఇచ్చేందుకే ఇలా చేశామని రాంజిత్ సింగ్ తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చిన ఆందోళనలు విరమించేది లేదని ఆయన అన్నారు. కొత్త దంపతులిద్దరూ రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ ప్రమాణం చేశారు. అనంతరం సావిత్రి భాయి పూలే, అంబేద్కర్ ఫోటోల చుట్టూ ఏడు అడుగులు నడిచారు. పెళ్లి సందర్భంగా వచ్చిన బహుమతులన్నింటిని అక్కడ ఉన్న రైతులకు పంచిపెట్టారు. ఈ పెళ్లి జరిపించిన రాంజిత్ సింగ్‌ని రైతులందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.