సృష్టిలో దేవతలకు కూడా దక్కని అపూర్వ బహుమతి మనుషులకు దక్కింది.. ఆ బహుమతి అమ్మే.. అమ్మ అంటే గుర్తుకు వచ్చేవి.. అనుబంధం.. అనురాగం.. ఆత్మీయత.. అన్నింటికీ మించి.. అమ్మంటే మనకు ముందుగా స్ఫురించేది.. ప్రేమ.. సృష్టిలో అమ్మ పంచే ప్రేమ మిగిలిన ప్రేమలకన్నా ఎక్కువ. అది వర్ణించరానిది. అమ్మ ప్రేమ గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలో మనం అపురూపంగా చూసుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆ వ్యక్తి.. కేవలం అమ్మే..! ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించిన మరో ప్రేమ ఉండదేమో. తల్లిప్రేమ అనేది ప్రపంచంలో ఎక్కడన్నా ఒక్కటే. ఏ జీవుల్లో అయినా ఒకే విధంగా ఉంటుంది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ కోతి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తన పిల్ల వానరాన్ని తీసుకొని రోడ్డు దాటుతుండగా తల్లి వానరాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి వానరానికి తీవ్ర గాయాలైనప్పటికీ తన పొట్ట కింది భాగంలో ఉన్న పిల్ల వానరాన్ని మాత్రం కాపాడుకుని గాయాలు కాకుండా తల్లి ప్రేమను చాటింది. ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడే పడి ఉన్న తల్లి వానరాన్ని విడిచి పిల్ల వానరం వెళ్లకుండా అంటిపెట్టుకొని ఉండడం స్థానికులను కలిచి వేసింది.
ఈ ఘటనను చూసి చలించిన వెంకటేష్ అనే యువకుడు వెంటనే చికిత్స కోసం తల్లి, పిల్ల వానరాలను చిగురుమామిడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాడు. అయితే.. లాభం లేదని డాక్టర్ చెప్పడంతో చేసేది ఏమీ లేక తన వ్యవసాయ పొలం వద్దకు వాటిని తీసుకువెళ్లాడు. అక్కడే వాటికి ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేసి, వెటర్నరీ డాక్టర్లతో చికిత్స అందిస్తున్నాడు. ప్రస్తుతం తల్లి వానరం ప్రాణంతో ఉంది. కానీ, ఎలాంటి కదలికలు లేకుండా కేవలం కళ్లు మాత్రమే తెరుస్తోంది. పిల్ల వానరం మాత్రం తల్లి వానరంతో ఉంటూ దయనీయ స్థితిలో కనిపిస్తోంది.