కరీంనగర్: ఆడపిల్ల పుట్టిందని భార్యను కాపురానికి రానీయలేదు ఓ ప్రబుద్ధుడు. దీంతో భార్య చంటి పాపతో భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన జిల్లాలోని జమ్మికుంట మండలం మాచనపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన స్పందనకు జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన గాండ్ల కిరణ్ తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. మూడేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఏడాది కిందట కాన్పు కోసమని స్పందన తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే 11 నెలల కిందట ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అక్కడి నుంచే ఆమెకు భర్త నుంచి కష్టాలు మొదలయ్యాయి. కొడుకును కంటావంటే కూతురును కన్నావేంటని భర్త కిరణ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కూతురు పుట్టింది కాబట్టి తనను కాపురానికి రానీచ్చేది లేదని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలోనే స్పందన గ్రామ పెద్దలను సంప్రదించి తన గోడును వెళ్లబోసుకుంది. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. పంచాయితీ జరిగిన ప్రతిసారీ భర్త కిరణ్ దే తప్పని పెద్ద మనుషులు తేల్చారు. పద్ధతి మార్చుకోవాలని, భార్యను కాపురానికి తీసుకుపోవాలని పెద్ద మనుషులు భర్త కిరణ్ కు చెప్పారు.
కాపురానికి తీసుకుపోను అని అంటున్నడు
కొన్ని రోజుల కిందట జరిగిన పంచాయితీలో భార్యను కాపురానికి తీసుకుపోతానని చెప్పిన కిరణ్... రేపు మాపు అంటూ ఇప్పటివరకు తీసుకుపోలేదు. దీంతో బాధితురాలు స్పందన మళ్లీ గ్రామ పెద్దలను కలవగా.. రెండు రోజుల కిందట పంచాయితీ నిర్వహించారు. పంచాయితీలో కిరణ్ దే తప్పని పెద్ద మనుషులు తీర్మానించారు. భార్యాపిల్లలను వెంట తీసుకెళ్లి పోషించుకోవాలని సూచించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో భార్యను కాపురానికి తీసుకుపోయేది లేదని.. ఏం చేస్కుంటారో చేస్కోండి అంటూ భర్త కిరణ్ తన అమ్మానాన్నలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో చేసేదేం లేక బాధితురాలు బంధువులతో కలిసి ఇవాళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. అయితే భార్య వస్తోందన్న సమాచారాన్ని ముందే తెలుసుకున్న కిరణ్ ఇంటికి తాళం వేసి అమ్మ నాన్నలతో పరారయ్యాడు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. పచ్చటి తమ కాపురంలో అత్తమామలు చిచ్చు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆడపిల్లను కన్నావంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారని ఆరోపించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి లేచేది లేదని బాధితురాలు స్పష్టం చేసింది.