అన్నం పెడ్తలేడని కొడుకు ఇంటి ముందు తల్లి ఆందోళన.

  • ఇంట్లోకి రాకుండా తాళం వేసిన తనయుడు

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పూలసెంటర్ లో కన్నతల్లికి అన్నం పెట్టకుండా ఇంటికి తాళం వేసి బయటకు వెల్లగొట్టడంతో  గురువారం కొడుకు ఇంటి ముందు ఓ తల్లి న్యాయపోరాటానికి దిగింది.    జిల్లా కేంద్రానికి  చెందిన బ్రహ్మదేవర సోమ నర్సయ్య-, అనసూయమ్మలకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు.  ఎంతో కష్టపడి పనిచేసిన సోమనర్సయ్య-, అనసూయమ్మ వారి పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. మనమల్లు, మనుమరాళ్లతో సంతోషంగా జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో  సంవత్సరం కింద  సోమనర్సయ్య అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి  మరణం తర్వాత కన్నతల్లికి  కొడుకు ఈశ్వరయ్య అన్నం పెట్టకుండా బయటకు గెంటేశాడు.  

దీంతో  ఆఫీసర్లను ఆశ్రయించడంతో  ఈశ్వరయ్యను పిలిచి తల్లిని ఇంట్లోనే ఉంచాలని సూచించారు.  కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత  తల్లికి అన్నం పెట్టకుండా నానా ఇబ్బందులకు గురి చేశాడు. ఇంట్లో నుంచి బయటకు గెంటేసి గేటుకు తాళం వేయడంతో ఇంటి ముందే తల్లి అనసూయమ్మ న్యాయపోరాటానికి దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  పెంచి పెద్ద చేస్తే తన కొడుకు, కోడలు  నానా బూతులు తిడ్తూ బయటకు నెట్టి వేశారని ఆవేదన వ్యక్తం చేసింది.  తల్లిని ఇంట్లోకి తీసుకొని వెళ్లాలని స్థానికులు ఎంత చెప్పినా ఈశ్వరయ్య వినకపోవడంతో 100 నెంబర్ కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఈశ్వరయ్యను  పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.