కొడుకు చావు తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

  • ఇప్పటికే కరోనాతో ఇద్దరు కుమారులు మృతి
  • హార్ట్​ ఎటాక్​తో చనిపోయిన మరో కొడుకు  
  • ఏడుస్తూనే కుప్పకూలిన వృద్ధురాలు 

వరంగల్​ సిటీ, వెలుగు: ఆమె వయస్సు 85 ఏండ్లు..మొత్తం ఐదుగురు కొడుకుల్లో ఇప్పటికే ఇద్దరు ఆమె కండ్ల ముందే కన్నుమూశారు. గురువారం మరో కొడుకు హార్ట్ ఎటాక్ ​వచ్చి చనిపోవడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది. ఏడుస్తూ ఏడుస్తూ కొడుకు శవం పైనే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన వరంగల్​లో జరిగింది. సిటీలోని అండర్​బ్రిడ్జి దగ్గర ఉన్న పెరుకవాడలో టింగిలికార్ ​భారతీబాయి ఉంటోంది. ఈమెకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. గత ఏడాది కరోనాతో రెండో కొడుకు, నాలుగో కొడుకు చనిపోయారు. అప్పటి నుంచి బాధలో ఉంది. ఆరోగ్యం బాగో లేకపోవడంతో భారతీ బాయిని కొద్దిరోజుల కింద దవాఖానాలో చేర్పించారు. బుధవారం సాయంత్రం మూడో కొడుకు టింగిలికార్​ కృష్ణ(45) గుండెపోటుతో చనిపోయాడు. దీంతో గురువారం ఉదయం భారతీబాయి(85)ని కృష్ణ డెడ్​బాడీని చూపించడానికి తీసుకువచ్చారు. కొడుకు మృతదేహాన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చిన భారతీబాయి అట్లనే  కుప్పకూలి మరణించింది. గురువారం ఇద్దరికి అంత్యక్రియలు చేశారు.