బిడ్డను ఉయ్యాలకు బదులు ఓవెన్​లో పడుకోబెట్టిన తల్లి

వాషింగ్టన్: నెల రోజుల పసికందును ఉయ్యాలకు బదులు.. పొరపాటున ఓవెన్​లో వేసింది కన్న తల్లి.. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం అమెరికాలోని కాన్సాస్ సిటీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పసికందు ఊపిరి పీల్చుకోవడంలేదంటూ ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేయడంతో పోలీసులు స్పాట్​కు చేరుకున్నారు.

కాలిన గాయాలతో ఆ చంటిబిడ్డ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతురాలి తల్లి మరియా థామస్(26)​ను విచారించిన తర్వాత వివరాలు వెల్లడించారు. బిడ్డను నిద్రపుచ్చేందుకు ఉయ్యాలలో వేసేందుకు బదులు పొరపాటున ఓవెన్​లో పడుకోబెట్టినట్లు మరియా చెప్పిందన్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలిపోయిన పసికందు బట్టలు, దుప్పటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనకు తల్లి మరియా మానసిక స్థితి కూడా కారణం అయ్యుండొచ్చని ఆమె స్నేహితురాలు పేర్కొన్నారు.