బతికుండగానే వృద్ధురాలికి నరకం.. చేతులు విరిచి వైకుంఠధామంలో వదిలిన్రు

మిర్యాలగూడ, వెలుగు : పొరపాటున కన్నబిడ్డకు చిన్న గాయమైతేనే తల్లడిల్లిపోయే హృదయం తల్లిది. బిడ్డ ఆ గాయం నుంచి బయటపడే వరకు ఆ తల్లి కంటికి నిద్ర ఉండదు. అలాంటి ఓ తల్లి చేతులను కన్నబిడ్డలే విరిచేశారు. నొప్పులు భరించలేక ఆ వృద్ధురాలు తల్లడిల్లుతోంది. ఈ అమానవీయ ఘటన ఆదివారం మిర్యాలగూడలోని వాటర్ ట్యాంక్  తండాలో వెలుగులోకి వచ్చింది. చివరి దశలో ఉన్న ఆ వృద్ధురాలికి ఇంత ఆహారం పెట్టి ఆకలి తీర్చాల్సిన కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు... ఆమె బతికి ఉండగానే శ్మశానవాటికకు చేర్చి బంధాలను సమాధి చేశారు. స్థానికులు, ఆ గ్రామ సర్పంచ్  ధనావత్ రాంచంద్  నాయక్  ఆ వృద్ధురాలిని చేరదీసి వివరాలు సేకరించారు. 

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఎర్రావులపాడుకు చెందిన చింతకాయల వెంకటరత్నమ్మ (70) కు భర్త ఏడుకొండలు, కుమారుడు వెంకటేశ్,  కుమార్తె ఉన్నారు. మూడు రోజుల క్రితం కొడుకు, కోడలు కలిసి వృద్ధురాలి కుడిచెయ్యి విరగ్గొట్టారు. ఆటోలో మిర్యాలగూడకు తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయారు. మొక్కలకు నీళ్లు పోసేందుకు గ్రామ పంచాయతీ స్టాఫ్  రవి వైకుంఠధామానికి వెళ్లగా... అక్కడ ఎండలో పడి ఉన్న వృద్ధురాలిని చూసి విషయం గ్రామ సర్పంచ్ రామచంద్ నాయక్ కు తెలిపాడు. దీంతో వైకుంఠధామం వద్దకు చేరుకున్న సర్పంచ్  రాంచందు ఆమెకు అల్పాహారం ఇచ్చి ఆకలి తీర్చారు. అదే వైకుంఠధామంలోని కంపోస్టు షెడ్డు వద్ద ఆమె నిద్రించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆమెకు భద్రత కలిగించేలా చూస్తామని సర్పంచ్  తెలిపారు.

ALSO READ : భువనగిరిలో బీఆర్ఎస్​కు ట్రిపుల్​ఆర్ ఎఫెక్ట్​

ఇంటికి వెళితే నా కొడుకు, కోడలు చంపేస్తరు

ఇంటికి వెళితే తన కొడుకు, కోడలు తనను చంపేస్తారని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. హాస్పిటల్ కి అయితే వస్తానని, ఇంటికి వెళ్లనని ఆ  వృద్ధురాలు స్థానికులతో చెప్పి కన్నీటిపర్యంతం అయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పిస్తామని స్థానికులు తెలిపారు.