ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మించాలి: తెలంగాణ వైద్యుల సంఘం

  • మహాధర్నాలో డాక్టర్ల డిమాండ్
  • 5రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తమని వెల్లడి

బషీర్ బాగ్, వెలుగు:  వందేండ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించా లని డిమాండ్ చేస్తూ..తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఉస్మానియాలో మహా ధర్నా నిర్వహించారు. ప్రజలకు ప్రాణం పోస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి ప్రాణం పోయండి అంటూ ప్లకార్డులతో డాక్టర్లు, నర్సులు తమ నిరసనను వ్యక్తం చేశారు. 
వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్ బొంగు రమేశ్​, డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... స్వయాన కేసీఆర్ ఉస్మానియా ఆసు పత్రికి వచ్చి కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని... ట్విన్ టవర్స్ కడతామని హామీనిచ్చి విస్మరించారన్నారు. కోర్టు కేసులే అడ్డంకి అయితే కొత్త సెక్రటేరియెట్​, 4 కొత్త మెడికల్ ఆసుపత్రులను నిర్మాణాలు ఎలా చేపట్టారని ప్రశ్నించారు.  ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు చిత్తశుద్ధి గత 7 ఏండ్లుగా ఎక్కడికి పోయిందన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొత్త భవనానికి శంకుస్థాపన చేసి, నిర్మాణం చేపట్టాలని డిమాండ్​ చేశారు. తమ సమస్యలపై ప్రిన్సిపల్ సెక్రటరీకు సమ్మె నోటీసులు ఇచ్చినా ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు.  నాలుగున్నర ఏండ్ల పీఆర్సీ ఎరియర్స్ ప్రభుత్వం విడుదల చేయకుండా మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐదు రోజుల పాటు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు.