పూడికతీత  పేరుతో నయా దందా

  •     ఇసుక కాంట్రాక్టర్ల భారీ స్కెచ్​
  •     26లక్షల క్యూబిక్​ మీటర్ల తవ్వకాలకు అనుమతులు
  •     ఎన్జీటీ సూచనలు బేఖాతర్​

భద్రాచలం,వెలుగు: గోదావరిలో  డీసిల్టేషన్​(పూడికతీత) పేరిట నయా దందాకు శ్రీకారం చుట్టారు. సీతారామా ప్రాజెక్టు లోకి నీరు రావడానికీ  ఇసుక మేటలు ఆటంకంగా ఉన్నాయంటూ భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో  గోదావరికి అటూ, ఇటూ ఇసుక తొలగించాలని ఆఫీసర్లు సిఫార్సు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని   కాంట్రాక్టర్లు భారీ దోపిడీకి  ప్లాన్​ వేశారు. మేటలు  తొలగించేందుకు  దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, మణుగూరు మండలాల పరిధిలో 10కి పైగా ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేశారు.  26లక్షల క్యూబిక్​ మీటర్ల ఇసుకను తవ్వి అమ్ముకునేందుకు   సిద్ధం అయ్యింది.

ఈ అనుమతుల విషయంలో ఎన్జీటీ (నేషనల్ గ్రీన్​ ట్రిబ్యునల్​) సూచనలను సైతం బేఖాతర్​ చేశారు. గతంలో మేడిగడ్డ ప్రాజెక్టులో పూడిక తీత పేరుతో ఇసుకను తవ్వడం వల్ల వచ్చే   ప్రతికూల పరిస్థితులపై రేలా అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జీటీని ఆశ్రయించింది. డీసిల్టేషన్​లో శాస్త్రీయత లేదని ఎన్జీటీ నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. అయినా సీతారామప్రాజెక్టులో నీటి నిల్వ కోసం ఇసుక మేటలు తొలగించేందుకు కాంట్రాక్టర్లు చాటుమాటున రికమండేషన్లు చేయించుకుని అనుమతులు తెచ్చుకున్నారు. 

ప్రాజెక్టు లేని చోట మేటలు ఎక్కడవి..?

సీతారామప్రాజెక్టు నిర్మాణమే లేదు. కానీ ఇసుక మేటలు ఎక్కడవి..? అన్న సందేహాలున్నాయి.  మేడిగడ్డ తరహాలో గోదావరిలో ఇసుక మేటల తొలగింపు పేరుతో కాంట్రాక్టర్లు నాలుగేళ్ల క్రితమే స్కెచ్​ వేశారు. ఇదంతా కాని పని అని టీఎస్​ఎండీసీ ఆ ఫైల్​ను తొక్కిపెట్టింది. టీఎస్ఎండీసీలో ఉన్నతాధికారులు మారడంతో కాంట్రాక్టర్లు మళ్లీ ఆ ఫైల్​ను తెరపైకి తీసుకొచ్చారు. ఇందుకోసం రెవిన్యూ, గ్రౌండ్​వాటర్​, ఇరిగేషన్​,మైనింగ్​లతో కూడిన కమిటీతో సర్వే చేయించారు. సాధారణంగా ఇసుక ర్యాంపులు నిర్వహించాలంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరి.

కానీ డీసిల్టేషన్​ పేరుతో నదుల్లో ,పట్టా భూముల్లో ఇసుక తవ్వితే పర్యావరణ అనుమతులు అవసరం లేదు. ఈ   టెక్నికల్​ పాయింట్​ను పట్టుకుని కాంట్రాక్టర్లు ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ఇందుకు మేడిగడ్డలో గతంలో ఇసుక మేటలు తొలగించిన విషయాన్ని పేర్కొంటూ సీతారామ ప్రాజెక్టులో కూడా ఈ తరహా తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయించారు. అయితే తవ్వకాలకు అగ్రిమెంట్​ కాంట్రాక్టర్లతో కాకుండా గిరిజన సొసైటీలతో చేయించాలనే నిబంధన పెట్టారు. అంటే మళ్లీ దీనికి పీసా గ్రామసభల తీర్మానం కావాలి.

ర్యాంపుల పరిధిలో ఈ సభలు పెట్టి గిరిజనుల అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే తీర్మానాలు కూడా సక్రమంగా చేయలేదు. గ్రామసభలు పెట్టకుండా, గ్రామపంచాయతీ సర్పంచ్​, సెక్రటరీలతో రాయించి ఆఫీసర్లకు ఇచ్చారు. ఇదంతా గవర్నమెంట్​ మారకముందు గత ప్రభుత్వ హయాంలో జరిగింది.క్యూబిక్​ మీటర్​కు రూ.136  ధర నిర్ణయించారు. ఇందులో రూ.20లు గిరిజన సొసైటీకి, రూ.18లు జీఎస్టీ, రూ.98లు కాంట్రాక్టర్​కు ఇవ్వాలని టీఎస్​ఎండీసీ తీర్మానించింది. 

 తీర్మానాలు ఎక్కడివి..?

కొత్త సర్కారు వచ్చాక టీఎస్​ఎండీసీ ఆఫీసర్లు ఈ ఫైల్​పై దృష్టి పెట్టారు. రీ సర్వేకు ఆదేశించారు. రీ సర్వేలో కూడా కాంట్రాక్టర్లు జిల్లాలోని ఇసుక కమిటీ, టెక్నికల్​ కమిటీలను మేనేజ్​ చేయించి డీసిల్టేషన్​కు సిఫార్సు చేయించుకున్నారు. ఈ క్రమంలో తిరిగి పీసా గ్రామసభల తీర్మానాల కాపీలు అవసరం వచ్చింది. ఇందుకు పంచాయతీ సర్పంచ్​లు లేరు. కొందరు సెక్రటరీలు బదిలీ అయ్యారు. కానీ కాంట్రాక్టర్లు తమకు అవసరమైన గ్రామసభల తీర్మానాలను పాత తేదీలతో చేయించి సంతకాలు, మోరీలు పెట్టించారు. పర్మిషన్ల కోసం అప్లై చేశారు. కాలపరిమితి ముగిశాక తీర్మానాలు ఎలా చేశారు..? అనే దానిపై చర్చ జరుగుతోంది.

ఏడాది క్రితం పర్మిషన్​ ఇచ్చినం

సీతారామ ప్రాజెక్టు ప్రాంతంలో డీసిల్టేషన్​కు ఏడాది క్రితం సిఫార్స్ చేసిన మాట వాస్తవమే. టెక్నికల్​ కమిటీలో మేమొక మెంబర్​ మాత్రమే. అక్కడ నదిలో ఇసుక ఉందా..? లేదా..? ఉంటే ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చో మేము  చెబుతాం. జిల్లా ఇసుక కమిటీ మిగిలిన పర్మిషన్లు ఇస్తుంది. 
- రాంప్రసాద్​, ఈఈ, నీటిపారుదల శాఖ