బీజింగ్: కీళ్ల నొప్పులతో రోజూ నరకం చూసే ఆర్థరైటిస్ పేషెంట్లకు భారీ ఉపశమనం లభించేలా చైనీస్ సైంటిస్టులు కొత్త చికిత్సను కొనుగొన్నారు. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య పెరగకుండా సమర్థంగా అడ్డుకునే బయో మెటీరియల్ హైడ్రోజెల్‌ను తయారు చేసినట్టు వారు ప్రకటించారు. సాధారణంగా ఆర్థరైటిస్ బారిన పడినవారిలో కీళ్ల వద్ద రెండు ఎముకలు కలిసేచోట కార్టిలేజ్ (మృదులాస్థి) దెబ్బతిని విపరీతమైన నొప్పి, వాపు వస్తుంటాయి. ఎముకల మధ్య రాపిడి జరిగి, అవి బిగుసుకుపోవడంతో రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటుంటారు.
Also Read:-రష్యా గూఢచారి..! శవమై కనిపించిన బెలూగా తిమింగలం
అయితే, ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా కీళ్ల వద్ద దెబ్బతిన్న కార్టిలేజ్‌కు ప్రత్యామ్నాయ లూబ్రికెంట్ మాదిరిగా పనిచేసే హైడ్రోజెల్‌ను తాము అభివృద్ధి చేసినట్టు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (సీఏఎస్) సైంటిస్టులు ఇటీవల ప్రకటించారు. కొల్లాజెన్ నుంచి సేకరించిన జెలాటిన్ మిథక్రిలేట్ అనే నేచురల్ ప్రొటీన్‌ను, సల్ఫోబిటైన్ మిథక్రిలేట్ అనే పాలిమర్‌ను కలిపి ఈ హైడ్రోజెల్‌ను తయారు చేసినట్టు వెల్లడించారు. దీనితో ఎలుకలపై ప్రయోగం చేయగా.. ఆర్థరైటిస్ నుంచి వాటికి ఉపశమనం లభించిందని సైంటిస్టులు తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న లూబ్రికెంట్లకన్నా హైడ్రోజెల్ సమర్థంగా పని చేస్తుందన్నారు.