మిర్చి కొనుగోళ్లలో కొత్తరకం దోపిడీ

  • రిమోట్​తో ఎలక్ట్రికల్ కాంటాల  నియంత్రణ 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన  రైతులు

చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో మిర్చి కొనుగోలు లో దళారులు కొత్త పద్దతుల్లో   రైతులను మోసగిస్తున్నారు.  తల్లాడ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన గుడిపల్లి రాంబాబు, ఎస్కే దస్తగిరి  గత పది రోజులు గా    గ్రామాల్లో  తిరుగుతూ  మిర్చి  కొనుగోలు చేస్తున్నారు. బెండాలపాడులో   క్వింటాలుకు  రూ 19 వేలు చెల్లించి మిర్చి  కొనుగోలు చేశారు.  

తేజావత్  రమేశ్ కు చెందిన మిర్చిని   ఎలక్ట్రానిక్  కాంటా తో తూకం వేసి రెండు ట్రాలీల్లో లోడు చేశారు.  25.53 క్వింటాళ్ళు వచ్చినట్లు  రైతుకు రసీదు ఇచ్చారు. అనుమానం వచ్చిన  రమేశ్ అదే గ్రామానికి చెందిన బాలు సహాయంతో దామరచర్లలోని   వే బ్రిడ్జి వద్ద కాంటా వేయగా 31.10 క్వింటాళ్లు   ఉన్నట్లు తేలింది.  ఐదు క్వింటాళ్ళ తేడా రావడంతో సదరు వ్యాపారులను నిలదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసి   ఆ వ్యాపారులకు మిర్చి అమ్మిన ఇతర  గ్రామాల రైతులు కూడా గురువారం  పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎలక్ట్రానిక్ కాంటాను రిమోట్ తో ఆపరేట్ చేసి తక్కువ తూకం వచ్చేలా సెట్ చేశారని  రైతులు రమేశ్, తిరుపతి రావు, రాజేశ్, శ్రీను, రామారావు ఆరోపిస్తున్నారు.    రైతుల కంప్లైంట్ మేరకు విచారణ  చేస్తున్నట్టు ఎస్​ఐ రవి తెలిపారు.  ఎక్కడెక్కడ ఎంత సరుకు కొన్నారు, ఎంత తేడాలు ఉన్నాయిఅన్న  కోణం లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.