సంగారెడ్డిలో అతీగతిలేని కొత్త మాస్టర్ ప్లాన్

సంగారెడ్డిలో అతీగతిలేని కొత్త మాస్టర్ ప్లాన్
  • ఇద్దరు మంత్రులు చెప్పినా ఐదేండ్లుగా పట్టని హెచ్ఎండీఏ
  • ఇండ్ల నిర్మాణాలకు అడ్డంకులు.. ఇబ్బందుల్లో స్థానికులు
  • రూ.కోట్ల ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ, హెచ్​ఎండీఏ 

సంగారెడ్డి, వెలుగు : జిల్లాలో గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిన సంగారెడ్డి పట్టణ కొత్త మాస్టర్ ప్లాన్​కు  ఐదేండ్లుగా అతీగతి లేకుండాపోయింది. 2013లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ తప్పుగా ఉందని, సర్వేలు, తనిఖీలు చేయకుండానే తయారు చేశారన్న ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఫిర్యాదులూ అందాయి. దాంతో అధికారులు మాస్టార్ ప్లాన్​ మారుస్తామన్నారు.. మరిచిపోయారు. ఇప్పటికీ సమస్య అలాగే ఉంది. 

సమస్య అంతా ఇక్కడే.. 

సంగారెడ్డి టౌన్ లోని రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా మాస్టర్ ప్లాన్ లో చూపుతూ అలైన్ మెంట్ తయారు చేశారు. కల్వకుంట- చిమ్నాపూర్ మీదుగా ఐఐటీ వరకు ప్రస్తుతం ఉన్న 60 ఫీట్ల రోడ్డును వంద ఫీట్లుగా చూపించారు. ఈ రోడ్డు అలైన్​మెంట్ తప్పుగా చూపడం వల్ల కల్వకుంట రోడ్డులోని వందల సంఖ్యలో ఇండ్లను కూల్చివేయాల్సి ఉంటుంది. కాగా ఐఐటీ నుంచి గొల్లగూడెం- మంజీరా పైప్ లైన్- పాత కంది మీదుగా ఐఐటీ వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు 100 ఫీట్ల రోడ్డుగా చూపినప్పటికీ ఈ రూట్​లో ఎక్కువ ఇండ్లకు నష్టం జరుగుతుండటంతో 100 ఫీట్ల రోడ్డు చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. వీటిని గుర్తించిన అప్పటి జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కన్నన్​, జిల్లా సంబంధిత అధికారులు మాస్టర్ ప్లాన్ మార్చాలని 2017లో హెచ్ఎండీఏ మున్సిపల్ కౌన్సిల్ కు లేఖ రాశారు. దాంతో  మాస్టర్ ప్లాన్, అలైన్​మెంట్ ను మార్చేందుకు ఫీల్డ్ విజిట్ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు చెప్పారు.  కానీ అది కార్యరూపం దాల్చకపోడంతో ఐదేండ్ల కింద మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు మాస్టర్ ప్లాన్ మార్పుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినా హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇండ్ల నిర్మాణాల పర్మిషన్లకు మాస్టర్ ప్లాన్ మార్పు అడ్డంకిగా మారి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఏడాది రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం మున్సిపాలిటీ, హెచ్ఎండీఏలు కోల్పోతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంగారెడ్డి మాస్టర్ ప్లాన్ పై చొరవ చూపించి మార్పులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇంకా పర్మిషన్ రాలే..

పట్టణంలోని కల్వకుంట ప్రాంతంలో నాకున్న 165 గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఏడాది కింద దరఖాస్తు పెట్టుకుంటే పర్మిషన్ ఇంకా రాలేదు. హెచ్ఎండీఏ పరిధిలో పెండింగ్ లో ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ ఆఫీసర్లను అడిగితే నిబంధనలకు అనుగుణంగా పర్మిషన్లు వస్తాయి. అది కూడా సంగారెడ్డి మున్సిపాలిటీలోనే తేల్చుకోవాలని అంటున్నారు.  ఏంచేయాలో తెలుస్తలేదు. 
- మనోహర్, బాధితుడు

పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే..

 కొత్త మాస్టర్ ప్లాన్ విషయమై హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల పరిధిలో పెండింగ్ లో ఉంది. దీంతో కొంత ఇబ్బంది అవుతున్నది వాస్తవమే. కానీ మార్పు చేసేంత వరకు ఇండ్ల నిర్మాణాలకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అనుమతులు ఇస్తున్నాం. 
- చంద్రశేఖర్, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్