బిగ్ ఈవెంట్స్ ముందు సోషల్ మీడియాలో షేర్లను ట్రెండింగ్ చేయడమే టార్గెట్
వెనకుండి నడిపిస్తున్న కంపెనీలు , పెద్ద ఇన్వెస్టర్లు
తాజాగా ట్రెండింగై భారీగా పెరిగిన బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ షేర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: ఫిన్‌ఫ్లూయెన్సర్ల సాయంతో మార్కెట్‌లో కొత్త స్కామ్ జరుగుతోంది. కంపెనీలు లేదా ఇతర పెద్ద ఇన్వెస్టర్లు వీరిని విరివిగా నియమించుకుంటున్నాయి. ఐపీఓ లేదా ఇతర బిగ్ ఈవెంట్స్ (డీల్స్ కుదరడం, కొత్త మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడం) ముందు సంబంధిత షేరును ట్రెండింగ్ చేయించి షేర్ల ధరలను భారీగా పెంచడమో లేదా పడేయడమో చేస్తున్నాయి. తాజాగా ట్విట్టర్‌లో #మోనోపాలిస్టాక్స్‌టూఇన్వెస్ట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది.
దీని కింద బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్‌ను బాగా ప్రమోట్ చేశారు. వీసా కన్సల్టెన్సీ సర్వీస్‌లు అందిస్తున్న ఈ కంపెనీ ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అయిన రోజు 8 శాతం పైగా పెరిగింది. ఈ హ్యాష్‌ట్యాగ్ గురించి తమకు తెలియదని, ఇతరులెవరైనా షేర్లను మానిప్యులేట్ చేస్తున్నారనే విషయం కూడా తెలియదని కంపెనీ ప్రతినిధులు మనీకంట్రోల్‌కు వెల్లడించారు. షేర్లను ట్రెండింగ్ చేయడం కామన్‌గా మారిందని ఫిన్‌ఫ్లూయెన్సర్లు, ఎనలిస్టులు, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్‌లు ఒప్పుకుంటున్నారు.
50 వేల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఎడెనిమిది మంది పెద్ద ఫిన్‌ఫ్లూయెన్సర్లు షేర్లను ట్రెండింగ్ చేయడం మొదలుపెడతారని ఓ ఫిన్‌ఫ్లూయెన్సర్ పేర్కొన్నారు. మరో 100 నుంచి 200 మంది చిన్న సైజ్ ఫిన్‌ఫ్లూయెన్సర్లు ఈ స్కామ్‌లో పాల్గొంటారని తెలిపారు. కొన్ని షేర్లను సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మార్చడమే వీరి పని అని అన్నారు. వీరిని నియమించుకునే కంపెనీలు లేదా పెద్ద ఇన్వెస్టర్లు ఈ యాక్టివిటీ కోసం రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
షేర్లను ట్రెండ్ చేయడం ఇలా జరుగుద్ది..
స్కామర్లు అంటే ఫిన్‌ఫ్లూయెన్సర్లను నియమించుకునే కంపెనీలు లేదా పెద్ద ఇన్వెస్టర్లు సోషల్ మీడియాలో ఎటువంటి టెక్స్ట్ సర్క్యూలేట్ అవ్వాలో నిర్ణయిస్తారు. ఇందుకోసం టెక్స్ట్ రెడీ చేస్తారు. మోనోపాలి లేదా బిగ్ టార్గెట్ మార్కెట్ వంటి పదాలను వాడతారు. చాలా సార్లు ఇటువంటి టెక్స్ట్ సక్సెస్‌ఫుల్‌గా ప్రజల్లోకి వెళ్లవు.
కంపెనీ అఫీషియల్ అకౌంట్‌ను లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ట్యాగ్ చేయకూడదని ఫిన్‌ఫ్లూయెన్సర్లకు స్ట్రిక్ట్‌గా చెబుతారు. దర్యాప్తు జరిగినప్పుడు ఇరుక్కోకుండా ఉండడానికి ఇలాంటి రూల్స్ పెడతారని ఓ ఫిన్‌ఫ్లూయెన్సర్ వెల్లడించారు. ఇలా షేర్లను ట్రెండింగ్ చేయడానికి కొన్ని కంపెనీలు తనను సంప్రదించాయని, తాను ఒప్పుకోలేదని పేర్కొన్నారు.
సెబీ దగ్గర రిజిస్టర్ కాని చాలా మంది ఫిన్‌ఫ్లూయెన్సర్లు సంబంధిత స్టాక్‌ను మొదట వాట్సాప్, టెలిగ్రామ్‌లో ట్రెండ్ చేస్తారు. ఆ తర్వాత ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ మందికి చేరుకోవడానికి ట్విట్టర్ వాడతారు. ‘కంపెనీలు లేదా పెద్ద ఇన్వెస్టర్లు డైరెక్ట్‌గా తమ షేరును ప్రమోట్ చేయాలని ఫిన్‌ఫ్లూయెన్సర్లను అడగరు. మొదట డిస్కషన్స్‌కి పిలుస్తారు. తన షేరు గురించి పాజిటివ్‌గా పోస్ట్‌లు పెట్టాలని చెబుతారు’ అని పైన పేర్కొన్న ఫిన్‌ఫ్లూయెన్సర్ అన్నారు.
షేరును ట్రెండింగ్ చేసే ముందు ఫిన్‌ఫ్లూయెన్సర్లు రోజుకి వెయ్యికి పైగా ట్వీట్స్ పోస్ట్ చేయడాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటారు. ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవ్వాలంటే కొన్ని రోజుల పాటు వీలున్నంత ఎక్కువ పోస్ట్‌లు చేయాల్సి ఉంటుందని డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ ఒకరు వివరించారు. పెద్ద ఫిన్‌ఫ్లూయెన్సర్లు ఒక ట్వీట్‌కి రూ. 50 వేల నుంచి రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. మైక్రో ఫిన్‌ఫ్లూయెన్సర్ అయితే ఒక ట్వీట్‌కు కనీసం రూ.2 వేలు తీసుకుంటారని అన్నారు. వీరు చేసే ట్వీట్లను ఫాలోవర్లు రీట్వీట్ చేస్తారని, అందుకే సంబంధిత టాపిక్ ట్రెండింగ్ అవుతుందని వివరించారు.
టాపిక్ గురించి ఫిన్‌ఫ్లూయెన్సర్ల ఫాలోవర్లు మాట్లాడుకునేలా చేయడమే చాలా కీలకం. వెయ్యి మంది ఫాలోవర్లు ఉన్న ఫిన్‌ఫ్లూయెన్సర్ కూడా టాపిక్‌కు తన ఫాలోవర్లు ఎంగేజ్ అయ్యేలా చేస్తే సంబంధిత టాపిక్‌ను ట్రెండింగ్ చేయగలడు. ఫాలోవర్లలో 5 శాతం మంది టాపిక్ గురించి మాట్లాడుకుంటే పరిస్థితి మంచిగా ఉన్నట్టు అంచనావేయొచ్చని ఎక్స్‌పర్ట్‌లు అన్నారు.
కంపెనీలు లేదా పెద్ద ఇన్వెస్టర్లు తమకు ఎక్కువగా సాయపడే ఫిన్‌ఫ్లూయెన్సర్‌ను నియమించుకుంటారు. అంటే కంపెనీ ఐపీఓ టైమ్‌లో షేర్లు ట్రెండింగ్ అవ్వాలంటే ఐపీఓల గురించి మాట్లాడే ఫిన్‌ఫ్లూయెన్సర్‌ను నియమించుకుంటారు. స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు ట్రెండ్ అవ్వాలనుకుంటే వీటి గురించి మాట్లాడే ఫిన్‌ఫ్లూయెన్సర్‌ను నియమించుకుంటారు.
షేర్లను ట్రెండింగ్ చేసేటప్పుడు ఫిన్‌ఫ్లూయెన్సర్లు క్యాచీ హ్యాష్‌ట్యాగ్స్ అంటే మల్టీబ్యాగర్, మల్టీబ్యాగర్ స్టాక్స్ వంటివి వాడకూడదు. ‘రిటర్న్స్ వస్తాయని ప్రామిస్ చేయడానికి వీలులేదు. వీటికి సంబంధించిన ఎటువంటి పదాలను కూడా వాడకూడదు. అంటే మల్టీబ్యాగర్ లాంటివి’ అని సెబీ దగ్గర రిజిస్టర్ చేసుకున్న ఓ రీసెర్చ్ ఎనలిస్ట్ వెల్లడించారు. అంతేకాకుండా ఇలాంటి ఎనలిస్టులు లేదా ఫిన్‌ఫ్లూయెన్సర్లు ఏదైనా షేర్లను ప్రమోట్ చేస్తే తమ పోస్ట్‌లలో మార్కెట్‌లో రిస్క్ ఉంటుందనే హెచ్చరిక జోడించాలి.