హైదరాబాద్ : జూన్ నెలలో జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లోకి చొరబడి గర్భిణిని బెదిరించి రూ.10 లక్షలు తీసుకెళ్లిన నిందితుడు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేష్ శుక్రవారం (జులై 21న) ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో గతంలో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు. తనను పోలీసులు అరెస్ట్ చేశారనే అవమానభారంతో రాజేష్ అత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
జూన్ నెలలో జూబ్లీహిల్స్ లోని ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డ రాజేష్ యాదవ్.. ఆ ఇంట్లో ఉన్న గర్భిణీని కత్తితో బెదిరించాడు. దాదాపు 6 గంటల పాటు ఆమెను ఇంట్లోనే నిర్బంధించి.. రూ.10 లక్షలు పట్టుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితుడు రాజేష్ అని గుర్తించి.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మూడు రోజులుగా అవమాన భారంతో కుమిలిపోయాడు రాజేష్. ఈ క్రమంలోనే ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.