దేశంలో కరోనా కొత్త రకాన్ని గుర్తించాం: కేంద్రం

విదేశీ స్ట్రెయిన్స్‌‌‌‌ కూడా వేగంగా విస్తరిస్తున్నాయి

కేసులు పెరగడానికి ఈ వేరియెంట్సే కారణమని చెప్పలేమని వెల్లడి 
కేసులు, వేరియెంట్స్‌‌‌‌ పెరగడం ఆందోళనకరం: ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌
అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు, నైట్‌‌‌‌ కర్ఫ్యూలు, లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ 

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికే రకరకాల కరోనా వేరియెంట్లు  ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు ఇంకో కొత్త రకం బయటపడింది. రెండుసార్లు రూపాంతరం చెందే 
( డబుల్ మ్యుటెంట్) వైరస్‌‌‌‌ను 18 రాష్ట్రాల్లో గుర్తించారు. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఈ విషయం వెల్లడించింది. విదేశాల్లో ఇప్పటికే బయటపడిన కరోనా వేరియంట్స్‌‌‌‌ కేసులు కూడా దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయని చెప్పింది. అయితే రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఈ కొత్త రకం స్ట్రెయిన్‌‌‌‌లే కారణమని ఇంకా వెల్లడికాలేదని తెలిపింది. కరోనాకు సంబంధించి జీనోమ్‌‌‌‌ సీక్వెన్సింగ్‌‌‌‌, ఇతర స్టడీస్‌‌‌‌ కొనసాగుతున్నాయని వివరించింది. మనిషి రోగనిరోధకశక్తిని తట్టుకొని వైరస్‌‌‌‌ తీవ్రత పెరిగేందుకు ఇలాంటి మ్యుటేషన్లు కారణమవుతాయని చెప్పింది.      
5 రోజుల్లోనే రెట్టింపైన వేరియంట్స్‌‌‌‌
దేశంలో కరోనా రకాలను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు 10 జాతీయ పరిశోధన కేంద్రాలతో ‘ది ఇండియన్‌‌‌‌ సార్స్-కోవ్‌‌‌‌-2 కన్సార్టియం ఆన్‌‌‌‌ జినోమిక్స్‌‌‌‌(ఐఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఏసీవోజీ)’ ను కేంద్ర ఆరోగ్య శాఖ గతేడాది ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు పంపిన 10,787 పాజిటివ్‌‌‌‌ శాంపిళ్లను ఐఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఏసీవోజీ విభాగం విశ్లేషించింది. వీటిలో 736 శాంపిళ్లలో బ్రిటన్‌‌‌‌ రకం, 34 శాంపిళ్లలో దక్షిణ ఆఫ్రికా రకం, ఒక శాంపిల్‌‌‌‌లో బ్రెజిల్‌‌‌‌కు చెందిన రకాన్ని గుర్తించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకాలు బయటపడ్డాయి. దేశంలో మార్చి 18 నాటికి 400 కొత్త రకం వేరియెంట్స్‌‌‌‌ కేసులు గుర్తించగా గత 5 రోజుల్లోనే ఇవి రెట్టింపయ్యాయి. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుండటం, మరోవైపు కొత్త రకాలు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగించే విషయమని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త రకం వైరస్‌‌‌‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయని, కరోనా రూల్స్‌‌‌‌ను జనం కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు.
రాజస్థాన్‌‌‌‌లో 8 నగరాల్లో నైట్‌‌‌‌ కర్ఫ్యూ
రాజస్థాన్‌‌‌‌లోని 8 నగరాల్లో మార్చి 22 నుంచి నైట్‌‌‌‌ కర్ఫ్యూ అమలవుతోంది. పట్టణాల్లో మార్కెట్లను రాత్రి 10 తర్వాత మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్‌‌‌‌లోని 8 మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్లలో ఏప్రిల్‌‌‌‌ 10 వరకు ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు, పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వాళ్లు నెగెటివ్‌‌‌‌ ఆర్టీపీసీఆర్‌‌‌‌ రిపోర్టు చూపించాలని  కర్నాటక సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మార్కెట్లు, ప్రార్థన ప్రదేశాల్లో ఆంక్షలు పెట్టారు. హోలీ, నవరాత్రి వేడుకలపై నిషేధం విధించారు. ఉత్తరప్రదేశ్‌‌‌‌లో ప్రస్తుతం ఎగ్జామ్స్‌‌‌‌ జరగని విద్యా సంస్థలన్నీ మార్చి 25 నుంచి 31 వరకు బంద్‌‌‌‌ చేయనున్నారు. తమిళనాడులోనూ అన్ని విద్యా సంస్థలూ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో 10, 12వ తరగతి స్టూడెంట్లు తప్ప మిగతా వాళ్లను ప్రమోట్‌‌‌‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మహారాష్ట్రలో 4 జిల్లాల్లో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌
మహారాష్ట్రలోని ముంబైలో ఒక్కరోజే 5,185 కేసులు నమోదయ్యాయి. దీంతో జుహు బీచ్‌‌‌‌ను మూసేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ముంబైలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నిషేధం విధించింది. కేసులు పెరుగుతుండటంతో నాగ్‌‌‌‌పూర్‌‌‌‌లో మార్చి 31 వరకు అధికారులు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించారు. మతపర కార్యక్రమాలను బ్యాన్‌‌‌‌ చేశారు. నాందేడ్‌‌‌‌, బీడ్‌‌‌‌, పర్భణిల్లో మార్చి 24 నుంచి ఏప్రిల్​ 4 వరకు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ విధించారు. పంజాబ్‌‌‌‌లోని 11 జిల్లాల్లో అన్ని సోషల్‌‌‌‌ గ్యాదరింగ్స్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేశారు. రాత్రి 9 నుంచి పొద్దున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అత్యవసరమైన కొన్ని కార్యక్రమాలకు 20 మందికి మించి హాజరవొద్దని ఆంక్షలు పెట్టారు. మధ్యప్రదేశ్‌‌‌‌లోని భోపాల్‌‌‌‌, ఇండోర్‌‌‌‌లలో ఆదివారాలు లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ పెట్టారు. ఒడిశాలో పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను 200 మందికి ప్రభుత్వం పరిమితం చేసింది.

ఒక్కరోజు 47 వేల కేసులు
దేశంలో గత 24 గంటల్లో 47,262 కేసులు నమోదయ్యాయని హెల్త్‌‌‌‌ మినిస్ట్రీ వెల్లడించింది. ఇందులో మహారాష్ట్రలో 28,699, పంజాబ్‌‌‌‌లో 2,254, కర్నాటకలో 2,010 కేసులు రికార్డయ్యాయని చెప్పింది. 24 గంటల్లో నమోదైన కేసుల్లో 80 శాతం 6 రాష్ట్రాల్లోనే ఉన్నాయంది. దేశంలో ప్రస్తుతం 3.38 లక్షల యాక్టివ్‌‌‌‌ కేసులున్నాయని తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో 275 మంది మరణించారని.. ఇందులో మహారాష్ట్రలో 132 మంది, పంజాబ్‌‌‌‌లో 53, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో 20 మంది చనిపోయారని వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మరణాలు నమోదవలేదని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 కోట్ల 8 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశామంది.

తమిళనాడు ఐటీ కంపెనీలో 40 మందికి..
తమిళనాడులోని చెన్నైలో ఓ ఐటీలో 40 మందికి పాజిటివ్‌‌‌‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం ఓ ఉద్యోగి అనారోగ్యానికి గురవడంతో పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు తేలింది. దీంతో కంపెనీలోని ఉద్యోగులందరికీ టెస్టులు చేయగా ఇప్పటివరకు 40 మందికి సోకినట్టు వెల్లడైంది. దీంతో కంపెనీని తాత్కాలికంగా మూసేసినట్టు తెలిసింది.