మీరు మనుషులేనా: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలేశారు..

హైదరాబాద్ లో ఘోరం జరిగింది.. అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆదివారం ( నవంబర్ 17, 2024 ) సిటీలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ హృదయ విదారక ఘటన. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సూరారం పోలిస్ స్టేషన్ పరిధి విశ్వ కర్మ కాలనిలో గల ఓ షాపు మెట్ల పై అప్పుడే పుట్టిన ఓ మగ శిశువు ను కవర్లో పెట్టీ వెళ్ళారు గుర్తు తెలియని వ్యక్తులు.అటుగా వెళ్తున్న స్థానికులు కవర్లో ఉన్న పసికందును గమనించి,పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే..  ఎంతకీ పోలీసుల రాకపోవడంతో చలి లో ఇబ్బంది పడుతున్న శిశువును స్థానికులే చికిత్స కోసం మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెల్లారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు పసికందు.ఘటన స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో, ఉదయం 5గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు స్థానికులు.

ఈరోజుల్లో చాలా మంది దంపతులు సంతానం లేక ఇబ్బంది పడుతుంటే.. పండంటి మగబిడ్డను రోడ్డుపై పడేయడానికి ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బిడ్డను పెంచటం భారంగా అనిపిస్తే ఏదైనా అనాధాశ్రమంలోనో లేక సంతానం లేనివారికో ఇవ్వచ్చుగా అంటున్నారు.