జీడిమెట్ల, వెలుగు: అప్పుడే పుట్టిన మగబిడ్డను ప్లాస్టిక్ కవర్‌లో కట్టి పార్కింగ్ చేసి ఉన్న ఓ ఆటోలో వదిలి వెళ్లారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సురారం విశ్వకర్మకాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాస్టిక్ కవర్‌లో నవజాత శిశువును తీసుకువచ్చి పార్కు చేసి ఉన్న ఆటోలో పెట్టి వెళ్లిపోయాడు.
ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. రోజు మాదిరిగానే ఆటో తీస్తుండగా ప్లాస్టిక్ కవర్‌లో నవజాత శిశువు ఉండటం చూసి స్థానికులకు విషయం తెలిపాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఐసీడీఎస్ అధికారుల సహకారంతో స్థానిక ఆసుపత్రికి శిశువును తరలించారు. కాగా శిశువును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.