నెత్తిన జీలకర్ర బెల్లం.. కాళ్లకు పారాణి.. పెళ్లి బట్టలతోనే గ్రూప్ 2 ఎగ్జామ్‎కు

నెత్తిన జీలకర్ర బెల్లం.. కాళ్లకు పారాణి.. పెళ్లి బట్టలతోనే గ్రూప్ 2 ఎగ్జామ్‎కు

పెళ్లి బట్టలు.. నెత్తిపై జీలకర్ర బెల్లం.. కాళ్లకు పారాణి.. ఇలా పెళ్లి మండపంలో ఉండాల్సిన ఓ నూతన వధువు పరీక్ష కేంద్రంలో దర్శనమిచ్చింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. పెళ్లి బట్టల్లో ఉన్న యువతి పరీక్ష కేంద్రానికి ఎందుకు వచ్చిందని ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది బిత్తరపోయారు. తీరా చూస్తే ఆ కొత్త పెళ్లి కూతురు గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిందని కాసేపటికి అర్థమైంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పరీక్ష సందర్భంగా చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (ఫిబ్రవరి 23) ఏపీలో గ్రూప్ 2 పరీక్ష జరిగింది. 

ఈ గ్రూప్ 2 పరీక్షకు మమతా అనే యువతి కూడా అప్లై చేసుకుంది. అయితే.. గ్రూప్ 2 పరీక్ష రోజే మమతా పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చిత్తూరులో  మమతా వివాహం చేసుకున్నది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఏళ్ల పాటు కష్టపడి చదవిన గ్రూప్ 2 పరీక్షకు మమతా హాజరైంది. ఆదివారం (ఫిబ్రవరి 23) ఉదయం పెళ్లి అనంతరం సరిగ్గా ఎగ్జామ్ సమయానికి పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాసింది మమతా. 

పెళ్లి బట్టలు, నెత్తిపై జీలకర్ర బెల్లం, కాళ్లకు పారాణితోనే మండపం నుంచి నేరుగా తిరుపతి పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ సెంటర్‎కు వచ్చి పరీక్ష రాసింది కొత్త పెళ్లి కూతురు మమతా. పెళ్లి బట్టల్లోనే మమతా ఎగ్జామ్ సెంటర్‎కు రావడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. దీంతో మమతా డెడికేషన్‎ని పలువురు కొనియాడాతున్నారు. అటు పెళ్లి.. ఇటు పరీక్ష రెండింటిని ఒకేరోజే మ్యానేజ్ చేయడంతో కొత్త పెళ్లి కూతురుని అభినందిస్తు్న్నారు. గవర్నమెంట్ జాబ్‎కు ఉండే పవర్ అలాంటిది మరీ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.