- భూపాలపల్లి తప్ప మిగతా 11 సెగ్మెంట్లలో 98 నామినేషన్లు
- భారీ ర్యాలీలతో నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల క్యాండిడేట్లు
వరంగల్/హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం నామినేషన్ల జాతర జరిగింది. ఏకాదశి, ఉత్తర నక్షత్రం కావడంతో ప్రధాన పార్టీల క్యాండిడేట్లతో పాటు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ, కొండా మురళి, బీజేపీ తరఫున ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, న్యూ ఇండియా పార్టీ నుంచి పనికెల శ్రీనివాస్, బీఎస్పీ నుంచి ట్రాన్స్‌జెండర్ పుష్పిత లయతో పాటు మరో ఏడుగురు నామినేషన్లు వేశారు.
వరంగల్ పశ్చిమలో 18 నామినేషన్లు రాగా ఇందులో కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి, బీజేపీ తరఫున రావు పద్మ, ఏఐఎఫ్‍బీ, కాంగ్రెస్ నుంచి జంగా రాఘవరెడ్డి నామినేషన్ వేశారు. నర్సంపేటలో కాంగ్రెస్ క్యాండిడేట్ దొంతి మాధవరెడ్డి, బీజేపీ నుంచి కంభంపాటి పుల్లారావు, బీఎస్పీ నుంచి గుండాల మదన్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు, వర్ధన్నపేటలో బీఆర్‍ఎస్ క్యాండిడేట్ అరూరి రమేశ్, బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్‍తో పాటు మరో ఎనిమిది మంది నామినేషన్లు వేశారు. పరకాలలో 15 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ క్యాండిడేడ్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి రెండు సెట్లు, బీజేపీ క్యాండిడేట్ పగడాల కాళీప్రసాద్‌రావు తరపున ఆయన భార్య , బీఆర్‌ఎస్ క్యాండిడేట్ చల్లా ధర్మారెడ్డి రెండు సెట్లు, ఆయన భార్య చల్లా జ్యోతితో పాటు పలువురు ఇతర పార్టీల నుంచి, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు.
మహబూబాబాద్‌లో 8, డోర్నకల్‌లో 4
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గంలో కలిపి గురువారం 12 నామినేషన్లు వచ్చాయి. మహబూబాబాద్‌కు కాంగ్రెస్ తరపున రమేశ్, బీజేపీ నుంచి బాలునాయక్, బీఎస్‌పీ నుంచి గుగులోత్ శంకర్‌తో పాటు మరో ఐదుగురు నామినేషన్లు వేశారు. డోర్నకల్‌లో ఆర్‌పీఐ (ఏ) నుంచి రాజేశ్, బీఎస్పీ నుంచి పార్వతి, కాంగ్రెస్ నుంచి రాంచంద్రు, బీఎస్పీ నుంచి ప్రమీల నామినేషన్లు ఇచ్చారు.
జనగామ జిల్లాలో 22..
జనగామ, వెలుగు : జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి గురువారం 22 మంది నామినేషన్లు వేశారు. జనగామలో కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆరుట్ల దశమంత్‌రెడ్డి, సీపీఎం నుంచి మోకు కనకారెడ్డి నామినేషన్ వేశారు. పాలకుర్తిలో కాంగ్రెస్ నుంచి మామిడాల యశస్వినిరెడ్డి, బీజేపీ నుంచి లేగ రామ్మోహన్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ తరఫున గుండె విజయ రామారావు నామినేషన్లు వేశారు. వీరితో పలువురు ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల లీడర్లు నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందజేశారు.
ములుగులో నాలుగు
ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీతక్క గురువారం మరో సెట్ నామినేషన్ వేయగా, బీజేపీ తరఫున అజ్మీర ప్రహ్లాద్, బీఎస్పీ నుంచి భూక్య జంపన్న, ఎంసీపీఐ(యూ) నుంచి నూనావత్ చంద్రునాయక్ నామినేషన్ వేశారు.