- పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా తన సైన్యాన్ని పంపితే అణుయుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 15–17 మధ్య రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. అకారణంగా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించాలని తాము అనుకోవడంలేదని స్పష్టం చేశారు. ‘సాంకేతికంగా అణుయుద్ధానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే, మేం తొందరపడటం లేదు. ఒకవేళ అమెరికా గనుక ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపితే ఆ దేశం యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకున్నట్టుగా భావించాల్సి వస్తుంది.
అప్పుడు మేం తప్పక బదులిస్తాం. అమెరికా–రష్యా మధ్య సంబంధాలపై వ్యూహాత్మక చర్చలు జరిపేందుకు అనేకమంది నిపుణులు ఉన్నారు. కనుక అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన అవసరం రాదనుకుంటున్నాం’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు ఉపయోగించేందుకు తమకంటూ కొన్ని విధివిధానాలున్నాయని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సిద్ధంగా ఉన్నదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే, ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని పుతిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం తర్వాత రష్యాలో ఎన్నికలు జరుగుతుండటంతో పుతిన్విజయంపై పలు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.
234 మంది చొరబాటుదారులు హతం
రష్యా సరిహద్దు ప్రాంతాల్లోకి చొరబడేందుకు యత్నించిన 234మందిని తమ సైన్యం, భద్రతా దళాలు హతమార్చాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ దళాలు సరిహద్దు దాడులను ఆపగలిగాయని, దాడిచేసినవారు ఏడు ట్యాంకులు, ఐదు సాయుధ వాహనాలను కోల్పోయినట్టు తెలిపింది.
కాగా, ఉక్రెయిన్‌కు చెందిన రెండు దీర్ఘశ్రేణి డ్రోనులు రెండు చమురు కేంద్రాలను ధ్వంసం చేశాయని రష్యా అధికార వర్గాలు తెలిపాయి.