![హైదరాబాద్‌లో దారుణం.. స్కూల్ వ్యాన్ కింద పడి చిన్నారి మృతి](https://static.v6velugu.com/uploads/2025/02/a-nursery-student-died-after-falling-under-the-school-van_SeYXkrZBhs.jpg)
ఎల్బీనగర్, వెలుగు: స్కూల్ వ్యాన్ నుంచి దిగిన నర్సరీ స్టూడెంట్.. అదే వ్యాన్ కింద నలిగి మృతిచెందింది. హైదరాబాద్ పెద్దఅంబర్ పేట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన నర్సింహ, శ్రీలత దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. కూతుర్లు అనన్య, రిత్విక(4)ను హయత్ నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్లో చదివిస్తున్నారు. రోజులానే గురువారం స్కూల్ ముగిసిన తర్వాత వ్యాన్‌లో ఇంటి వద్ద దింపిన డ్రైవర్.. ఆ చిన్నారులు ఇంట్లోకి వెళ్లకముందే వ్యాన్‌ను రివర్స్ తీశాడు. దీంతో వ్యాన్ వెనుక ఉన్న రిత్వికపైకి ఎక్కడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా.. ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ఘటనలో అనన్యకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా, రోజూ వచ్చే వ్యాన్ కాకుండా గురువారం వేరే వ్యాన్ రావడం.. డ్రైవర్ చిన్నారులను గమనించకుండా ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా రివర్స్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ‘చెల్లె చేయి పట్టుకొని వస్తుంటే వ్యాన్ గుద్దింది.. చెల్లె, నేనూ కిందపడ్డాం. చెల్లె ముక్కు నుంచి రక్తం వచ్చి.. ఆ తర్వాత ఏం మాట్లాడలేదు’’ అంటూ రిత్విక అక్క అనన్య ఏడ్చుకుంటూ చెప్పడంతో అక్కడ ఉన్నవాళ్లంతా కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు, చిన్నారి బంధువుల ఆందోళన
ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్‌ను నడపడమే కాకుండా.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు, చిన్నారి బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ఎంఈఓ వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.