పాములకు నిలయంగా మారిన బీర్కూర్ బీసీ బాయ్స్ హాస్టల్

పాములకు నిలయంగా మారిన బీర్కూర్ బీసీ బాయ్స్ హాస్టల్

ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్లు, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డ విద్యార్థులకు ఇప్పుడు ప్రాణగండాలు ఎదురవుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ హాస్టల్ లో  పాము కరిచి ఓ విద్యార్థి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి సాయిరాజ్ కుటుంబ సభ్యులు..హాస్టల్ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత కూడా హాస్టల్ పరిసరాల్లో  పాములు కనిపించడం కలకలం రేపింది. చెత్తను తొలగిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలిని పాముకాటు వేసింది. దీంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. 

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలిని పాము కాటు వేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అపరిశుభ్రంగా ఉన్న బీర్కూర్ బీసీ బాలుర వసతి గృహం పరిసరాలను ఆగమేఘాల మీద పంచాయతీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. హాస్టళ్లలో పాములు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో తరచూ విష సర్పాలు వస్తున్నాయని వాపోతున్నారు. వరుస ఘటనలతో విద్యార్థులు భయంతో ఇంటికి వెళ్లిపోయారు. 

కామారెడ్డి జిల్లా బీర్కూర్ బీసీ హాస్టల్ లో విద్యార్థి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలు పడుకునే దగ్గరే పాము కనిపించడంతో పాము కాటుకు గురై ఉంటాడన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి. పిల్లలు కింద పడుకోవడం, హాస్టల్ చుట్టూ నీళ్లు నిలిచి ఉండడం, చెత్తాచెదారం ఉండడంతో పాములు వచ్చి ఉంటాయంటున్నారు. అన్నం, పప్పు ఉడకకపోయినా, ఫుడ్ లో కప్పలు చెత్తా చెదారం వస్తే పస్తులుంటున్నారు పిల్లలు. కానీ ఇప్పుడు హాస్టల్స్ లో సరైన వసతులు లేక ఏకంగా ప్రాణాలు పోయే దుస్థితి ఏర్పడింది. హాస్టల్ లో మంచాలు కూడా లేకపోవడం, నేలపైనే పడుకోవడంతో పాము కాటు వేసినట్లుగా చెబుతున్నారు. 

బీర్కూర్ బీసీ హాస్టల్ లో సాయిరాజ్ అనే విద్యార్థి చనిపోయాడు. దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్ బిర్కూర్ బీసీ హాస్టల్ లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో సాయిరాజ్ కు వాంతులు అవడంతో హాస్పిటల్ కు తరలించారు. ఉదయం 5 గంటలకు సాయిరాజ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పాము కరిచిందని హాస్టల్ సిబ్బంది తెలిపారని సాయిరాజ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతిపై వివిధ రకాల కారణాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ హాస్టల్ కు చేరుకున్న సాయిరాజ్ కుటుంబ సభ్యులు.... హాస్టల్ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. రిపోర్ట్ తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి. సాయిరాజ్ మృతికి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని కలెక్టర్ పాటిల్ ఆయన్ను సస్పెండ్ చేశారు.