ప్రిన్సిపల్‌‌పై కక్షతో పేపర్‌‌ లీక్‌‌ నాటకం

ఆదిలాబాద్, వెలుగు : టెన్త్‌‌ ఉర్దూ ఎగ్జామ్‌‌ పేపర్‌‌ లీక్‌‌ అయిందని, మైనార్టీ స్కూల్‌‌లో మాస్‌‌ కాపీయింగ్‌‌ చేస్తున్నారంటూ ఫేక్‌‌ న్యూస్‌‌ వైరల్‌‌ చేసిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్‌‌పై ఉన్న పగతోనే ఫేక్‌‌ న్యూస్‌‌ను వైరల్‌‌ చేసినట్లు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఉట్నూర్‌‌ మైనార్టీ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లో ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగం చేస్తున్న మహ్మద్‌‌ ముబాషీర్‌‌కు నాన్‌‌ టీచింగ్‌‌ స్టాఫ్‌‌తో గొడవలు జరగడంతో అతడిని ఇచ్చోడకు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. ఇచ్చోడకు వెళ్లడం ఇష్టంలేని ముబాషీర్‌‌ ఉట్నూర్‌‌లోని ఏకలవ్య స్కూల్‌‌లో పీజీటీగా చేరాడు. 

అలాగే కాగజ్‌‌నగర్‌‌కు చెందిన ఆసిఫ్‌‌ గతంలో అక్కడి టీఎంఆర్‌‌ఎస్‌‌లో క్లర్క్‌‌గా పనిచేసేవాడు. ఆ టైంలో విధులు సరిగా నిర్వహించకపోవడంతో అప్పుడు అక్కడ పనిచేసిన వెంకటప్రసాద్‌‌ రిపోర్ట్‌‌ ఆధారంగా అతడిని విధుల నుంచి తొలగించారు. దీంతో వెంకటప్రసాద్‌‌ వల్లే తాము ఉద్యోగాలు కోల్పోయామంటూ ముబాషీర్‌‌, ఆసిఫ్‌‌ ఇద్దరూ ఆయనపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ఉట్నూర్‌‌ మైనార్టీ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌లో పనిచేసే టీచర్‌‌ అబ్దుల్‌‌ సమీ ఇంటికి సయ్యద్‌‌ కైఫ్‌‌ అనే వ్యక్తిని పంపించి ఫొటోలు, వీడియోలు తీసి పంపించాలని కోరారు. ఉదయం 10.30 గంటల టైంలో కైఫ్‌‌ సమీ ఇంటి వెళ్లగా అతడు ఉర్దూ గ్రామర్‌‌కు సంబంధించిన నోట్స్‌‌ రాస్తున్నాడు. 

దీంతో కైఫ్‌‌ వెంటనే వీడియో, ఫోటోలు తీసి వాట్సాప్‌‌ ద్వారా ముబాషిర్‌‌కు పంపించాడు. తర్వాత ముబాషీర్‌‌ సమీకి ఫోన్‌‌ చేసి స్కూల్‌‌లో మాల్‌‌ ప్రాక్టీస్‌‌ జరుగుతుందా అని పదే పదే అడగడంతో అసహనానికి లోనైన సమీ ‘అవును మాస్‌‌ కాపీయింగ్‌‌ జరుగుతుంది, జడ్పీహెచ్‌‌ఎస్‌‌ నుంచి పేపర్‌‌ వచ్చింది, ఆన్సర్లు తయారు చేసి పంపించాం’ అంటూ చెప్పాడు. దీంతో అతడి మాటల రికార్డులతో పాటు, వీడియోలు, ఫొటోలను కాగజ్‌‌నగర్‌‌లో ఉన్న ఆసిఫ్‌‌కు పంపించారు. వాటి సాయంతో ఫేక్‌‌ న్యూస్‌‌, వీడియోలు తయారు చేసి 19వ తేదీన వాట్సప్‌‌లో వైరల్‌‌ చేశారు. విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు అది ఫేక్‌‌ న్యూస్‌‌ అని నిర్ధారించి, అందుకు కారణమైన ముబాషీర్‌‌, ఆసిఫ్‌‌, కైఫ్‌‌పై కేసు నమోదు చేశారు.