- బై పోల్ మినహా ఆరు జనరల్ ఎలక్షన్స్‌లో ఇదే రిపీట్
- ఈ సారి కరీంనగర్ లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ
- మళ్లీ గెలిచి పాత సెంటిమెంట్తుడిచివేస్తానంటున్న బండి
- 15 ఏండ్ల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వెలిచాల
- ఓడిన చోటే మళ్లీ గెలిచేందుకువినోద్ కుమార్ విశ్వప్రయత్నం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఓటర్లు ఒకసారి గెలిపించిన పార్టీని.. వరుసగా రెండో సారి గెలిపించడం లేదు. గత 25 ఏండ్లలో జరిగిన బైపోల్ మినహా.. ఆరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇదే సీన్ రిపీటైంది. ఒకసారి ఒక పార్టీని గెలిపిస్తే, తర్వాత వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్నారు. 1996 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది.
ఈ సారి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో వరుసగా రెండోసారి గెలిచి బండి సంజయ్ పాత సెంటిమెంట్ ను తుడిచివేస్తారా..లేదంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు గెలిచి సెంటిమెంట్‌ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో నాలుగింటిలో కాంగ్రెస్ గెలవగా..మూడు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.
ఆరు జనరల్ ఎలక్షన్స్‌లో ఇదే సెంటిమెంట్ రిపీట్
కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో జరిగిన బై పోల్ మినహా గత ఆరు జనరల్ ఎలక్షన్స్‌లో ఒకసారి గెలిచిన పార్టీ వరుసగా రెండోసారి గెలవడం లేదు. 1996కు ముందు జువ్వాడి రమాపతి రావు, ఎమ్మెస్సార్, జువ్వాడి చొక్కారావు హ్యాట్రిక్ విజయాలు అందుకోగా.. ఆ తర్వాత రెండోసారి వరుసగా ఎవరూ గెలవలేదు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ గెలవగా.. 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు విజయం సాధించారు.
2004లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్, 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. ఈ క్రమాన్ని పరిశీలిస్తే గత మూడు దశాబ్దాల్లో ఒక ఎన్నికలో గెలిచిన పార్టీ.. వరుసగా రెండోసారి గెలవడం లేదు. కేసీఆర్ ఎంపీగా రాజీనామా చేయడంతో 2008లో జరిగిన బై ఎలక్షన్స్ లో మాత్రం మళ్లీ ఆయనే గెలిచారు.
కాగా, ఈ ఎన్నికల్లో వరుసగా రెండో సారి గెలిచి పాత సెంటిమెంట్ తుడిచివేస్తానని బండి సంజయ్ చెప్తుండగా..15 ఏండ్ల తర్వాత పాలిటిక్స్ లో యాక్టివ్ అయిన వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ఇన్ చార్జి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ క్యాడర్‌ను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన చోటే గెలిచేందుకు వినోద్ కుమార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
రామమందిరం, 12 వేల కోట్ల నిధులే సంజయ్ ప్రచారస్త్రాలు..
అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి కేవలం 3 వేల ఓట్ల తేడా ఓడిపోయిన బండి సంజయ్.. లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో పని చేస్తున్నారు. ప్రజాహిత యాత్ర ద్వారా ఇప్పటికే ఒక దఫా లోక్ సభ నియోజవకవర్గాన్ని చుట్టేసిన ఆయన.. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా మీటిం గ్స్ పెడుతున్నారు. అయోధ్య రామమందిరం అంశంతోపాటు, నేషనల్ హైవేస్ లాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు కేంద్రం విడుదల చేసిన రూ.12 వేల కోట్లు తానే తీసుకొచ్చానంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రజాసమస్యలపై తాను చేసిన పోరాటం, తనపై పెట్టిన కేసుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాగా సంజయ్ మాటలే తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం, సంజయ్ తో పార్టీ సీనియర్లెవరూ కలిసిరాకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. .
మంత్రి పొన్నం భుజాన కాంగ్రెస్ గెలుపు బాధ్యతలు..
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరును కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఖాయం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం మద్దతుతో ఇప్పటికే ఆయన నామినేషన్ వేశారు. రాజేందర్ రావు గెలుపు కోసం కరీంనగర్ లోక్ సభ పరిధిలోని కాంగ్రెస్ లీడర్లంతా ఏకతాటిపైకి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది.
కరీంనగర్ ఎమ్మెల్యేగా తన తండ్రి వెలిచాల జగపతి రావు చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, పాంచ్ న్యాయ్ ను ప్రచారం చేస్తూ ఆయన ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు పోటీలో ఉన్న సంజయ్ కు ఒకసారి, వినోద్ కు ఒకసారి అవకాశమిచ్చారని, తనను ఒకసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. కరీంనగర్ గెలుపు బాధ్యతను మంత్రి పొన్నంకు అప్పగించడంతో..ఒకరకంగా ఆయనే పోటీలో ఉన్నట్లుగా పని చేయాల్సి వస్తోంది. చివరిదాకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడం, ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకపోతుండడం కాంగ్రెస్‌కు మైనస్‌గా చెప్పవచ్చు
బీఆర్ఎస్కు మైనస్‌గా నేతల అక్రమాలు..
కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ.. ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక బయటపడుతున్న ఆ పార్టీ లీడర్ల అక్రమాలు, భూకబ్జాలు ప్రజల్లో మరింత వ్యతిరేకతను పెంచాయి. కరీంనగర్ అభ్యర్థి వినోద్ కుమార్ నాన్ లోకల్ అంటూ ప్రత్యర్థులిద్దరూ ప్రచారం చేస్తుండడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ లీడర్లు వందలాదిగా బీఆర్ఎస్ ను వీడుతుండడం, ఆయన వెంట ఉండే కీలక నాయకులే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతుండడం, జాబ్స్, కబ్జాల పేరిట తన బంధువులపై వస్తున్న ఆరోపణలు ఆయనకు మైనస్ గా మారాయి.