న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మలిహాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై 6 కిలోల కంటే ఎక్కువ బరువున్న రెండు అడుగుల పొడవైన దుంగను పెట్టారు. ఆ దుంగను ఢిల్లీ- -– లక్నో మధ్య నడిచే బరేలీ - -వారణాసి ఎక్స్‌ప్రెస్ (రైలు నం.14236 ) ఢీకొట్టి కొంత దూరం లాక్కెంది. అనంతరం అది మెటల్ వీల్స్ కింద చిక్కుకుపోయింది. లోకో పైలట్ సడెన్‌బ్రేకులు వేసి రైలును సురక్షితంగా ఆపారు. ఈ ఘటనతో ట్రాక్‌లపై ఉండే సిగ్నలింగ్ పరికరం దెబ్బతిన్నది.
లోకో పైలట్ సమీప రైల్వే స్టేషన్ మాస్టర్లకు విషయం తెలపడంతో.. తనిఖీ బృందం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది వచ్చి అతి కష్టం మీద ఆ దుంగను బయటకు తీశారు. దీంతో లక్నో -– -హర్దోయ్ మధ్య రెండు గంటలపాటు రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ ఘటనపై మలిహాబాద్ పోలీస్ స్టేషన్‌లో రైల్వే అధికారులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.