హిందీలో ఎందుకు మాట్లాడుతున్నావ్.. కన్నడం రాదా..? బెంగళూరు బస్ కండక్టర్ వీడియో వైరల్

హిందీలో ఎందుకు మాట్లాడుతున్నావ్.. కన్నడం రాదా..? బెంగళూరు బస్ కండక్టర్ వీడియో వైరల్

బెంగళూరు: కర్నాటక రాజధాని నగరం బెంగళూరులో సిటీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. బస్ టికెట్ తీసుకున్న ప్రయాణికుడు తనకు రావాల్సిన చిల్లర డబ్బు కోసం కండక్టర్ను హిందీలో అడిగాడు. హిందీలో మాట్లాడటంపై సదరు బస్ కండక్టర్ అభ్యంతరం తెలిపాడు. తన దగ్గర చిల్లర లేదని చెప్పాడు. చిల్లర ఇచ్చేందుకు నిరాకరించాడు.

అంతటితో ఆగకుండా.. కన్నడలో మాట్లాడాలని హిందీలో కాదని బస్ కండక్టర్ ప్రయాణికుడితో గొడవపడ్డాడు. భౌతిక దాడికి కూడా దిగాడు. ఈ ఘటనను బాధిత ప్రయాణికుడు వీడియో తీసి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అభినవ్ రాజ్ అనే యువకుడు బెంగళూరులోని ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో సీనియర్ అసోసియేట్గా జాబ్ చేస్తున్నాడు.

 

మంగళవారం రాత్రి సిటీ బస్ ఎక్కాడు. బస్ టికెట్ 15 రూపాయలు అయితే సరిపడ చిల్లర లేక కండక్టర్కు 20 రూపాయలు ఇచ్చాడు. తన దగ్గర 5 రూపాయల చిల్లర లేదని కండక్టర్ చెప్పాడు. కండక్టర్ దగ్గర చిల్లర ఉంచుకుని కూడా తనకు 5 రూపాయలు ఇచ్చేందుకు నిరాకరించాడనేది ప్రయాణికుడి వాదన. తన 20 రూపాయలకు తనకు ఇచ్చేస్తే యూపీఐ పేమెంట్ చేస్తానని బస్ కండక్టర్కు చెప్పినా వినిపించుకోలేదని అభినవ్ సోషల్ మీడియాలో చెప్పాడు. 

ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మారతహళ్లిలోని రెయిన్బో హాస్పిటల్ దగ్గరకు బస్ చేరుకోగానే గొడవ మరింత ముదిరింది. హిందీలో కాదు కన్నడలో మాట్లాడాలని ప్రయాణికుడిపై బస్ కండక్టర్ చేయి చేసుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. బస్ కండక్టర్ తీరుపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం బెంగళూరులో కన్నడ భాషనే మాట్లాడాలని బస్ కండక్టర్ చర్యను సమర్థిస్తున్నారు.