భద్రాచలం : మంచంపై కూర్చుని ఆడుకుంటున్న ఓ చిన్నారి కిందపడిపోవడంతో.. చేతిలో క్యాప్ తీసి ఉన్న పెన్ను తలలో గుచ్చుకుంది. భద్రాచలం పట్టణంలోని సుభాశ్ నగర్ కు చెందిన నాలుగేళ్ల చిన్నారి రియాంచిన ఇంట్లో మంచంపై కూర్చుని ఆడుకుంటూనే పెన్ తో రాస్తూ ఆడుకుంటోంది. ఈక్రమంలో మంచంపై నుంచి కింద పడిపోవడంతో.. ఆమె చేతిలోని పెన్ను చెవి పైభాగంలో గుచ్చుకుంది. దాదాపు సగం పెన్ను చిన్నారి తలలోకి దిగిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన చిన్నారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స ప్రారంభించకముందే.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ న్యూరోసర్జన్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఖమ్మం తరలించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించి తలలోని దిగిన పెన్నుని డాక్టర్లు తొలగించారు. పాప ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. ఇంట్లో ఒంటరిగా ఆడుకునే పిల్లలకు పెన్నులు, పదునైన వస్తువులు చాలామంది ఇస్తూ ఉంటారు. వాటి వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు ఈ ఘటనతో హెచ్చరిస్తున్నారు.